Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,033+5.35%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,397/10g+0.76%
भाषाएँ

Latest News

కాప్‌–31లో సమానత్వం, ఆచరణాత్మక వాతావరణ చర్యలే భారత్‌ లక్ష్యం వాతావరణ నిధులు, సాంకేతిక బదిలీ, న్యాయబద్ధ పరివర్తనకు ప్రాధాన్యం: భూపేందర్‌ యాదవ్‌

nagendra4 November 2026, 5:07 AM1 व्यूtrinetnews.com
కాప్‌–31లో సమానత్వం, ఆచరణాత్మక వాతావరణ చర్యలే భారత్‌ లక్ష్యం వాతావరణ నిధులు, సాంకేతిక బదిలీ, న్యాయబద్ధ పరివర్తనకు ప్రాధాన్యం: భూపేందర్‌ యాదవ్‌

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 03:

వాతావరణ మార్పులపై అంతర్జాతీయ చర్యలు సమానత్వంతో, ఆచరణాత్మక పరిష్కారాల దిశగా సాగాలని భారత్‌ కృషి చేయనున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. నవంబర్‌ 9 నుంచి 20 వరకు తుర్కియేలోని అంటాల్యాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు కాప్‌–31లో భారత్‌ ప్రాధాన్యాలను మంగళవారం న్యూఢిల్లీలో మీడియాకు వివరించారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాల పెంపు, విజ్ఞాన భాగస్వామ్యం, ఆయా భౌగోళిక పరిస్థితులకు తగిన పరిష్కారాలపై భారత్‌ దృష్టి సారిస్తుందని చెప్పారు. జీ–77, చైనా, ఎల్‌ఎండీసీ, బేసిక్‌ దేశాల సమూహాలతో కలిసి పనిచేస్తామన్నారు. పారిస్‌ ఒప్పంద లక్ష్యాల సాధనకు సానుకూల సహకారం అందించేందుకు భారత్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

వాతావరణ నిధుల సమీకరణ ప్రధాన ప్రాధాన్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు. పారిస్‌ ఒప్పందంలోని ఆర్టికల్‌ 9.1 ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అందించడం అభివృద్ధి చెందిన దేశాల బాధ్యత అని గుర్తుచేశారు. ఈ నిధులు స్థిరంగా, ముందస్తు అంచనాకు వీలుగా, ప్రధానంగా ప్రభుత్వ వనరుల నుంచి రాయితీ నిబంధనలతో అందాలని, రుణభారాన్ని పెంచకూడదని పేర్కొన్నారు.

ఉద్గారాల తగ్గింపు చర్యలు, ప్రపంచ పురోగతి సమీక్ష దేశాల ఆధ్వర్యంలోనే సాగాలని యాదవ్‌ అన్నారు. జాతీయంగా నిర్ణయించుకున్న వాతావరణ లక్ష్యాలను గౌరవిస్తూ, పైస్థాయి నుంచి కొత్త లక్ష్యాలను రుద్దకూడదన్నారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తట్టుకునే అనుకూలన చర్యలకు నిధులు పెంచాలని, సంబంధిత ప్రపంచ సూచికలను నిధుల లభ్యతకు షరతులుగా విధించకూడదని స్పష్టం చేశారు.

న్యాయబద్ధ పరివర్తనను వాతావరణ న్యాయం, అభివృద్ధి హక్కు, అందుబాటు ధరల్లో ఇంధన ప్రాప్తి కోణంలో చూడాలని తెలిపారు. సాంకేతిక బదిలీకి వ్యయం, మేధోసంపత్తి హక్కులు, వాణిజ్యపరమైన అడ్డంకులను పరిష్కరించాలని కోరారు. కార్బన్‌ మార్కెట్లలో భాగస్వామ్యం స్వచ్ఛందంగానే ఉండాలన్నారు.

వ్యవసాయం, ఆహార భద్రత, చిన్న–సన్నకారు రైతుల జీవనోపాధితో వాతావరణ అనుకూలనకు ఉన్న సంబంధాన్ని భారత్‌ సదస్సులో ప్రస్తావించనుంది. స్వీడన్‌తో కలిసి లీడ్‌ఐటీ 3.0 కార్యక్రమంతోపాటు తీరప్రాంతాల స్థితిస్థాపకత, అంతర్జాతీయ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌, అడవులపై చర్చల్లో పాల్గొననుంది.

అర్మేనియాలోని యెరెవాన్‌లో జరిగిన జీవవైవిధ్య సదస్సు కాప్‌–17లో కున్మింగ్‌–మాంట్రియల్‌ ప్రపంచ జీవవైవిధ్య చట్రాన్ని సమర్థంగా, సమానత్వంతో అమలు చేయాలని భారత్‌ కోరినట్లు మంత్రి తెలిపారు. జీవవైవిధ్య పరిరక్షణకు తగిన నిధులు, సాంకేతిక సహకారం, స్థానిక సమాజాల భాగస్వామ్యం అవసరమన్నారు. జన్యు వనరుల డిజిటల్‌ సీక్వెన్స్‌ సమాచార వినియోగం ద్వారా వచ్చే ప్రయోజనాలను న్యాయంగా పంచాలని భారత్‌ స్పష్టం చేసిందన్నారు.

మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో జరిగిన ఎడారీకరణ నిరోధక సదస్సు కాప్‌–17లో భూ పునరుద్ధరణ, కరవును తట్టుకునే సామర్థ్యంపై భారత్‌ దృష్టి సారించిందని చెప్పారు. 2030 నాటికి 2.6 కోట్ల హెక్టార్లకు పైగా భూమిని పునరుద్ధరించాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించామన్నారు. కరవు వచ్చిన తర్వాత స్పందించడం నుంచి ముందస్తు సన్నద్ధత వైపు మారాలని సూచించినట్లు తెలిపారు.

అంటాల్యా సదస్సులో హామీల నుంచి అమలు దిశగా పురోగతి సాధించే సమతుల్య ఫలితాల కోసం భారత్‌ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని భూపేందర్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

और पढ़ें →