బుధవారం28 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,246-0.00%
NIFTY22,699+0.05%
22K₹1,32,612/10g+1.22%
భాషలు

తాజా వార్తలు

రైతులు సంఘటితమైతేనే మంచి ధర, మార్కెట్ సౌకర్యం: 'రైతు నేస్తం'లో రైతు సంఘాలకు ప్రత్యేక అవగాహన

nagendra28 October 2026, 2:56 AM0 చూసులుtrinetnews.com
రైతులు సంఘటితమైతేనే మంచి ధర, మార్కెట్ సౌకర్యం: 'రైతు నేస్తం'లో రైతు సంఘాలకు ప్రత్యేక అవగాహన

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

- రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది: వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ &వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, ఐ.ఏ.ఎస్.

- సంఘాల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు: చిన్న రైతులకు అద్దెకు యంత్రాలు, సంఘాలకు ఆదాయం

- గెర్కిన్స్, మునగ పొడి ఎగుమతుల్లో రైతులకు అధిక ఆదాయ మార్గాలు

- ఎల్‌నినో ప్రత్యామ్నాయ ప్రణాళిక, నేల సంరక్షణకు 'ఖేత్ బచావో అభియాన్'

  • హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 27:

పంట పండించడం ఒక ఎత్తయితే, పండిన పంటను మంచి ధరకు అమ్ముకోవడం మరో ఎత్తు. ఒక్కడిగా మార్కెటింగ్ చేసుకునే రైతుకు మంచి ధర, మెరుగైన మార్కెట్ సౌకర్యాలు, పంటకు డిమాండ్ దొరకడం కష్టమవుతోంది. రైతులంతా కలిసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా (FPOలు) ఏర్పడినా, మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGలు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) సభ్యులుగా చేరినా ఈ ఇబ్బందులు తగ్గుతాయని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. సంఘటితంగా ఉంటే పంటకు డిమాండ్ పెరగడంతో పాటు మంచి ధర కూడా దక్కుతుందని తెలిపింది.

ఈ సంఘాల్లోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా వారి కోసమే 'రైతు నేస్తం' 112వ ఎపిసోడ్‌ను మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటైంది. వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ &వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, ఐ.ఏ.ఎస్. ముఖ్య అతిథిగా పాల్గొని, రైతు ఉత్పత్తిదారుల సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

రైతు సంఘాల బలోపేతమే లక్ష్యం

కార్యక్రమంలో ప్రసంగించిన వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి. గోపి, ఐ.ఏ.ఎస్. మాట్లాడుతూ, రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అందులో భాగంగానే ఈ రోజు 'రైతు నేస్తం' ప్రత్యేక కార్యక్రమాన్ని వీరి కోసమే నిర్వహించామని తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి, చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ పనిచేస్తోందన్నారు. పథకాల లబ్ధిదారుల ఎంపికలో క్షేత్రస్థాయి అధికారులు ఈ సంఘాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఆయన సూచించారు.

అద్దెకు యంత్రాలు: కస్టమ్ హైరింగ్ సెంటర్లు*

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కస్టమ్ హైరింగ్ సెంటర్లను (CHC) ఏర్పాటు చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు ప్రతి యంత్రాన్నీ కొనుక్కోలేరు. అందుకే

FPOలు, SHGలు, PACS ద్వారా ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి. యంత్రాలను అద్దెకు ఇవ్వడం వల్ల ఆ సంఘాలకు ఆదాయం వస్తుంది, చిన్న రైతులకు ఖర్చు తగ్గుతుంది. భూమి అభివృద్ధి, విత్తనం–నాటడం, అంతరకృషి, సస్యరక్షణ, కోత–నూర్పిడి, కోత అనంతర పనులు, పంట అవశేషాల నిర్వహణ అనే ఏడు విభాగాల్లో 37 రకాల యంత్రాలు ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. వీటిలో పవర్ టిల్లర్, రోటోవేటర్, విత్తన–ఎరువు డ్రిల్, పవర్ స్ప్రేయర్లు, కిసాన్ డ్రోన్, కంబైన్ హార్వెస్టర్, పసుపు బాయిలర్, పాలిషర్, స్ట్రా బేలర్ ఉన్నాయి. దీనివల్ల కూలీల కొరత తగ్గి, ఖర్చు, సమయం ఆదా అవుతాయి. పథకం నియమాలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, రైతులు నేరుగా పొందే ప్రయోజనాలను వ్యవసాయ కమిషనరేట్ అధికారులు వివరించారు.

ఎల్‌నినో జాగ్రత్తలు, నేల సంరక్షణ

ఎల్‌నినో నేపథ్యంలో అమలు చేయాల్సిన ప్రత్యామ్నాయ (కాంటింజెన్సీ) ప్రణాళిక, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, రైతులకు ఇవ్వాల్సిన అవగాహనపై అధికారులు వివరించారు. 'ఖేత్ బచావో అభియాన్' అమలు తీరు, నేల సంరక్షణ లక్ష్యాలను కూడా విపులంగా చర్చించారు.

ఎగుమతిదారులు, కొనుగోలుదారుల అనుభవాలు

పంటలను పెద్ద ఎత్తున కొనే సంస్థలు, అగ్రిగేటర్లు, విలువ జోడించిన ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు, దేశీయంగా, విదేశాలకు ఎగుమతి చేస్తున్న సంస్థల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, సహకార సంఘాలు అధిక ఆదాయం ఎలా పొందవచ్చో వారు వివరించారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్‌లోని కోహీర్ మండలంలో రైతులు 'గెర్కిన్స్' అనే ప్రత్యేక రకం కీరదోసను పండిస్తున్నారు. వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్న కంపెనీ ప్రతినిధులు, స్వల్ప కాలంలో ఈ పంటను ఎలా సాగు చేయాలో, పంట తర్వాత విలువ జోడించిన ఉత్పత్తులుగా మార్చి ఇతర దేశాలకు ఎలా పంపుతున్నారో చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మునగ ఆకులను సేకరించి, పొడిగా తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్న కంపెనీ ప్రతినిధులు తమ అనుభవాలను రైతులతో పంచుకున్నారు.

రబీ సాగుకు సూచనలు

రబీ సీజన్‌లో పంటల ఎంపికపై కూడా వ్యవసాయ శాఖ రైతులకు సూచనలు చేసింది. నవంబర్ మొదటి పక్షం వరకు పప్పుధాన్యాలు, నూనెగింజలు విత్తుకోవచ్చు. నవంబర్ 16 తర్వాత పెసర, మినుము, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగ మాత్రమే అనుకూలం. నీటి లభ్యతను బట్టి పంటను ఎంచుకోవాలని, కుసుమ, శనగ, పెసర, మినుము తక్కువ నీటితో పండుతాయని, జొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగకు తగినంత నీరు అవసరమని తెలిపింది. పూత, కాయ నిండే దశల్లో తప్పనిసరిగా నీరు అందించాలని, సిఫారసు చేసిన రకాలనే అధికారిక డీలర్ల నుంచి కొనుగోలు చేయాలని సూచించింది. రైతులు సంఘాలుగా ఏర్పడి, ప్రభుత్వ పథకాలను, మార్కెటింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది.

ఇవి కూడా చదవండి