భూ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
క్షేత్రస్థాయిలో సర్వేను పరిశీలించి రైతులకు భూమి విస్తీర్ణంపై స్పష్టత ఇవ్వాలి
రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోం
పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి
పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 27:
రెవెన్యూ ఉద్యోగులు సక్రమంగా, బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే ప్రజల ముఖ్యంగా రైతుల సమస్యలు తీరుతాయని ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు రెవెన్యూ ఉద్యోగులను ఆదేశించినప్పటికీ పూర్తిస్దాయి ఫలితాలు కనిపించలేదని భవిష్యత్తులో మార్పురాకపోతే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హెచ్చరించారు. మంగళవారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖల పనితీరుపై సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంత్రి పొంగులేటి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం రీ సర్వే చేపట్టింది
భూ సర్వే నిర్వహణకు సంబంధించి పలువురు తహసీల్దార్లు, సర్వేయర్లతో ముఖాముఖి నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే కోసం ఎన్ని గ్రామాలను కేటాయించారు, ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో సర్వే పూర్తయింది, ఏ విధంగా సర్వే నిర్వహిస్తున్నారు, రోజుకు ఎన్ని ఎకరాల భూమిని సర్వే చేస్తున్నారు, సర్వే పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతోంది తదితర అంశాలపై ఆరా తీశారు.
సర్వే సమయంలో సంబంధిత రైతుకు తన భూమి ఎంత విస్తీర్ణంలో ఉందో స్పష్టంగా తెలియజేయాలని తహసీల్దార్లు, సర్వేయర్లకు సూచించారు. భూమి విస్తీర్ణం, సరిహద్దులకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, రైతులకు ఎలాంటి సందేహాలు లేకుండా వివరించాలని పేర్కొన్నారు.
తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు రెవెన్యూ అధికారులు సర్వే ప్రక్రియను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తూ, రైతుల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాదీ ఆస్తుల రీ సర్వేను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందని, రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారమయ్యే వరకు విడతలవారీగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై నిర్మాణ వ్యయ భారాన్ని తగ్గించేందుకు సిమెంట్ బ్యాగ్‌ను కేవలం రూ.230కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రిగారు ఆదేశించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులు వేగవంతంగా, పూర్తి పారదర్శకంగా, అర్హత ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమీక్షకు ముందు పలువురు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న భూ సమస్యలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులకు సంబంధించిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్లకు మంత్రి పలు సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు అందించిన సలహాలు, సూచనలను స్వీకరించారు.
ఈ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు, సురేశ్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, సంజీవరెడ్డి ,సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్ జైన్, హైమావతి, ప్రతిమా సింగ్‌లతో పాటు అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.





