హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 24:
విజయదశమి సందర్భంగా శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రివర్స్ రైటింగ్ కళాకారిణి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత ఉద్యోగిని వల్లి కృష్ణ విజయదశమి నంది అవార్డును అందుకున్నారు. తెలంగాణ తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా వల్లి కృష్ణ మాట్లాడుతూ.. బ్యాంకు ఉద్యోగం నుంచి పదవీ విరమణ అనంతరం వివిధ కళారంగాల్లో ప్రావీణ్యం సాధిస్తూ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందినట్లు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ, యాంకరింగ్‌తో పాటు ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగాలు చేసినట్లు పేర్కొన్నారు. తన కళాసేవలను గుర్తించి విజయదశమి నంది అవార్డుతో సత్కరించడం ఆనందంగా ఉందని, శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.





