Sunday25 October 2026Hyderabad

SENSEX73,124-2.15%
NIFTY22,600-2.36%
HYD 22K₹1,30,645/10g-3.25%
Languages

Latest News

రైల్వే భద్రతకు నిఘా ఆధారిత పోలీసింగ్‌

nagendra25 October 2026, 3:11 AM0 viewstrinetnews.com
రైల్వే భద్రతకు నిఘా ఆధారిత పోలీసింగ్‌

Share this story

Share link keeps your language (?lang=)

ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ, రాష్ట్ర పోలీసుల సమన్వయంపై దృష్టి రైల్‌మదద్‌ వేదికతో జీఆర్‌పీ సిబ్బంది అనుసంధానం

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 24: రైల్వే ప్రయాణికుల భద్రతను బలోపేతం చేసేందుకు నిఘా ఆధారిత పోలీసింగ్‌తో పాటు రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌), ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ), రాష్ట్ర పోలీసుల మధ్య మరింత సమన్వయం అవసరమని జీఆర్‌పీ చీఫ్‌ల ఎనిమిదో అఖిల భారత సదస్సు పేర్కొంది. ఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ఈ సదస్సు అక్టోబర్‌ 23న ముగిసింది.

ఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ సోనాలి మిశ్రా అధ్యక్షతన జరిగిన సదస్సులో రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈఓ సతీశ్‌కుమార్‌, బోర్డు సభ్యులు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జీఆర్‌పీ చీఫ్‌లు పాల్గొన్నారు. రైల్వే భద్రతలో ఎదురవుతున్న సవాళ్లు, ఉత్తమ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు.

ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారాన్ని మెరుగుపరిచేందుకు సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (క్రిస్‌) ద్వారా జీఆర్‌పీ సిబ్బందిని రైల్‌మదద్‌ వేదికతో అనుసంధానించడం సదస్సులో ప్రధాన అంశంగా నిలిచింది. దీనివల్ల సకాలంలో సమాచార మార్పిడి, ఫిర్యాదుల పర్యవేక్షణ, సంబంధిత విభాగాల స్పందన మరింత మెరుగుపడనుంది.

దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టిన ‘పింక్‌ పెట్రోల్‌: ఐస్‌ ఇన్‌ ది స్కై, శక్తి ఆన్‌ ది గ్రౌండ్‌’ కార్యక్రమాన్ని సదస్సులో వివరించారు. మహిళా సిబ్బంది నేతృత్వంలో డ్రోన్లతో నిఘా, ‘శక్తి’ వ్యవస్థ కింద వేగంగా స్పందించే బృందాలను సమన్వయం చేసే ఈ విధానంపై చర్చించారు.

రైళ్లపై రాళ్లదాడుల నివారణకు సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ పెంపు, పటిష్ఠ నిఘా, నిందితులపై కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. యువతకు అవగాహన కల్పించడం, స్థానిక సమాజంతో కలిసి ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం, ఆర్‌పీఎఫ్‌–జీఆర్‌పీ సమన్వయాన్ని పెంచడంపై దృష్టి సారించారు.

దీపావళి, ఛఠ్‌ తదితర పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక కీలకమని సదస్సు పేర్కొంది. ఉత్తర రైల్వే ఢిల్లీ డివిజన్‌ అధికారులు ఢిల్లీ పోలీసులు, జీఆర్‌పీ, ఢిల్లీ మెట్రో అధికారులతో చేపడుతున్న సమన్వయ చర్యలను వివరించారు. సీసీటీవీ పర్యవేక్షణ, ప్రకటనలు, బారికేడ్లు, ప్రత్యేక నిరీక్షణ ప్రదేశాలు, కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా ప్రయాణికుల రాకపోకలను సురక్షితంగా నిర్వహించడంపై చర్చించారు.

మధ్య రైల్వే పుణె డివిజన్‌ అమలు చేస్తున్న ‘ప్రాజెక్ట్‌ దిశ’ కూడా సదస్సులో ప్రస్తావనకు వచ్చింది. రైల్వే పట్టాల సమీపంలో నివసించే పిల్లలకు విద్యా, వినోద కార్యక్రమాలతో పాటు భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, స్థానిక ప్రజల సహకారంతో రాళ్లదాడులు, దొంగతనాలు, అనధికారికంగా పట్టాలు దాటడం వంటి ప్రమాదకర చర్యలను నిరోధించేందుకు కృషి చేస్తున్నారు.

ఆర్‌పీఎఫ్‌–జీఆర్‌పీ సంయుక్త శిక్షణ, విద్రోహ చర్యల నివారణ, మాదకద్రవ్యాల గుర్తింపునకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పంచుకోవడం వంటి అంశాలపైనా చర్చించారు. డిజిటల్‌ ఆధారాల నిర్వహణ, ప్రామాణిక విధానాలు, నిఘా సమాచార మార్పిడి, దర్యాప్తు సామర్థ్యాలు, మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

ప్రయాణికుల్లో విశ్వాసం పెంచేలా మర్యాదపూర్వకంగా, వృత్తినిబద్ధతతో పోలీసులు వ్యవహరించాలని రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈఓ సతీశ్‌కుమార్‌ సూచించారు. సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, అన్ని విభాగాల సమష్టి కృషితో భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవచ్చన్నారు. రైల్వే భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు నిఘా ఆధారిత పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని ముగింపు ప్రసంగంలో ఆర్‌పీఎఫ్‌ డీజీ సోనాలి మిశ్రా పిలుపునిచ్చారు.

Also read