Sunday25 October 2026Hyderabad

SENSEX73,124-2.15%
NIFTY22,600-2.36%
HYD 22K₹1,30,645/10g-3.25%
Languages

Latest News

డబుల్ బెడ్ రూమ్స్కి ఇండ్ల పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొన్నం

nagendra25 October 2026, 3:10 AM2 viewstrinetnews.com
డబుల్ బెడ్ రూమ్స్కి ఇండ్ల పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొన్నం

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 24:

అర్హులైన పేద ప్రజలకు రెండు పడక గదుల ఇండ్లను అందిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం 2 బీహెచ్ కే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కార్వాన్ శాసనసభ్యులు కౌసర్ మొహియుద్దీన్, బహదూర్ పురా శాసనసభ్యులు మొహమ్మద్ మోబీన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా లతో కలసి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వం పేద కుటుంబాలందరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. మొదటి విడతలో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు , రెండో విడతలో మరో 2,000 ఇండ్ల చొప్పున మొత్తం 5,500 ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు . అలాగే గుడిసెలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లను కేటాయించే కార్యక్రమాన్ని చేపట్టామని, అర్హతే ప్రామాణికంగా రాజకీయాలు, కులం, మతం వంటి భేదాలు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఉపాధి ఒకచోట, నివాసం మరొకచోట ఉండటం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ దిశగా ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకొని ఉపాధి చోటనే ఇళ్లను చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో నగరానికి దూరంగా నిర్మించిన ఇళ్లు ఉపాధి కేంద్రాలకు దూరంగా ఉండటంతో లబ్ధిదారులు వాటిలో నివసించలేక, ఇళ్లు ఖాళీగా ఉండి పాడైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎకరం భూమి రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు విలువ చేసే ప్రాంతాల్లోనైనా అవసరాన్ని బట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.లబ్ధిదారులు తమ నియోజకవర్గ పరిధిలోనే, ఉపాధి అవకాశాలకు దగ్గరగా నివసించేలా ఇందిరమ్మ అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి వేగవంతంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. బోనాల పండుగ నాటికి లక్ష ఇండ్ల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా కార్యాచరణ అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనాధ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుకు గుర్తింపు కల్పించేందుకు యూడీఐడీ కార్డుల జారీ కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్పారు.విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమం సహా వివిధ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 2300 యూ డి ఐ కార్డులు అలాగే ఇతర ధృవీకరణ పత్రాలను అందజేయటం జరిగిందని, వారి సంక్షేమానికి, సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యూడీఐ కార్డులను అనాధ పిల్లలకు అందచేసి ఉజ్వల భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ఎల్ నినో పరిస్థితులను ప్రస్తావిస్తూ రాబోయే 8 నెలల్లో వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమలు చేపట్టడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి వనరులను పొదుపుగా వాడుకోవాలని ఇలా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న ఎండల నేపథ్యంలో ముఖ్యంగా తాగునీటి లభ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని జరిగిందని పేర్కొన్నారు.

Also read