ఆదివారం25 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,124-2.15%
NIFTY22,600-2.36%
22K₹1,30,645/10g-3.25%
భాషలు

తాజా వార్తలు

మాట ముత్యమవ్వాలి - మదిని తాకాలి. మాటల మాధుర్యం - మనుషుల సౌభాగ్యం

nagendra25 October 2026, 3:07 AM0 చూసులుtrinetnews.com
మాట ముత్యమవ్వాలి - మదిని తాకాలి. మాటల మాధుర్యం - మనుషుల సౌభాగ్యం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఆరోజు ఉదయం పాఠశాలలో ప్రార్థన సమయంలో వార్తలు చదవడం ఆరవ తరగతి విద్యార్థులకు కేటాయించబడింది. ఆరవ తరగతి నుండి ఒక విద్యార్థిని వార్తలు చదవడానికి వేదిక మీదకు వచ్చింది. తను అలా వేదిక మీదికి వచ్చి మాట్లాడడం ఇదే మొదటి సారి. తను వార్తలు చదవబోయే ముందు ప్రార్థన స్థలంలో తన ముందు నిలబడి ఉన్న సుమారు 600 మంది విద్యార్థులను చూసి ఒక్కసారిగా ఆందోళనకు లోనైంది. వార్తలు చదవడం మొదలుపెట్టింది కానీ ఆమె మాటలు తడబడుతున్నాయి. రెండు వాక్యాలు చదవడం పూర్తవగానే ఇక భయంతో నోట మాట రావడం లేదు. ఆమె కళ్ళలో భయం కనిపిస్తుంది. అంతా నిశ్శబ్దం. తన పరిస్థితిని చూసి విద్యార్థులలో కొందరు ఎగతాళిగా నవ్వడం తను గమనించింది. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. వార్తలు చదవలేక పోతుంది.

  1. ఇది గమనించిన ఒక ఉపాధ్యాయుడు వేదికపై ఉన్న ఆ విద్యార్థిని దగ్గరికి వెళ్లి, ఆమె చేతిలో ఉన్న మైకు తీసుకొని "సుమారు ఇక్కడున్న 600 మంది విద్యార్థులకు రాని ఒక అద్భుతమైన అవకాశం ఈ విద్యార్థినికి వచ్చింది. ఇంత మంది ముందు నిలబడి, వేదిక మీద వార్తలు చదవడానికి ముందుకు వచ్చిన ఈ అమ్మాయి ధైర్యాన్ని మనం ముందుగా అభినందించాలి." అని అనగానే అక్కడున్న విద్యార్థుల చప్పట్లతో పాఠశాల మారుమోగింది.

అది విన్న ఆ అమ్మాయిలో కాస్త భయం తగ్గింది. వెంటనే ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థినితో "నువ్వు ధైర్యంగా వార్తలు చదవడం పూర్తి చేసేదాకా నేను నీ ప్రక్కనే నిలబడి ఉంటాను.' అని అంటూ తన భుజం తట్టారు. ఇక ఆ అమ్మాయి ఒక్కో వాక్యం చదువుతూ మొత్తానికి వార్తలు చదవడం పూర్తి చేసింది.

విద్యార్థులందరూ తరగతి గదుల్లోకి వెళ్లిన తర్వాత ఆ ఉపాధ్యాయుడు ఆ అమ్మాయితో "ఎవరేమనుకుంటారో, తప్పుగా చదువుతానేమో అనే భయమే నిన్ను ఓడిస్తుంది. వినే వాళ్ళందరూ మెచ్చుకునే లాగా చదువుతాను అనుకుంటూ చదవడం ప్రారంభిస్తే ఆ ఆలోచనే నిన్ను గెలిపిస్తుంది." అని చెప్పారు. ఉపాధ్యాయుడు చెప్పిన ఆ చివరి మాటలే ఆ విద్యార్థిని మనసులో బలంగా నాటుకుపోయాయి. ఇక అప్పటి నుండి ఆ అమ్మాయి వేదిక మీద భయపడకుండా ధైర్యంగా మాట్లాడడం ప్రారంభించింది.

ఆ విద్యార్ధిని మాటల్లో భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని నింపేలా చేసింది ఆ ఉపాధ్యాయుడు చెప్పిన నాలుగు మాటలే కదా.. అందుకే "మాటే మంత్రం" అంటారు.

మనుషులకు మాత్రమే ఉన్న అద్భుతమైన కళలు రెండు. వాటిలో ఒకటి ఆలోచన. రెండోది మాట్లాడగలగడం. ఎదుటివారితో సంభాషణలో భాగంగా మనం మాట్లాడే మాటలకు ఎదుటివారిని ప్రభావితం చేయగల శక్తి ఉంది. అందుకే ఆ మాటలను ఏ సందర్భంలో మాట్లాడాలి, ఎలాంటి పదజాలం ఉపయోగించాలి, ఎంతవరకు మాట్లాడాలి అని ఆలోచిస్తే అద్భుతమైన "వక్త" అవుతారు.

స్నేహితుడి లేదా బంధువుల పుట్టినరోజున ఆన్లైన్లో వెతికి ఏదో ఒక సందేశం పంపే బదులు, వారితో మీకు నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావిస్తూ "ఫలానా సందర్భంలో నేను ఊహించని విధంగా నాకు సహాయం చేశావు, తోడుగా నిలిచావు, ఆ విషయంలో నీకు కృతజ్ఞుడిని" అని లేదా వారిలో మీరు గమనించిన ఒక మంచి గుణాన్ని గుర్తుచేస్తూ వారికి శుభాకాంక్షలు తెలపండి. మీరు, మీ మాటలు వారికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

ఎదుటివారి చేతిరాత, వారి ఆలోచన, నైపుణ్యం, హాస్య చతురత ఇలా ఏదైనా మీకు నచ్చిన లక్షణం వారిలో కనిపిస్తే మనస్పూర్తిగా అభినందించండి. ఆ పొగడ్త వారిలో ఆ మంచి లక్షణం మరింతకాలం కొనసాగేలాగా, మరింత మెరుగయ్యేలాగా చేస్తుంది. రేపటి వారి ఎదుగుదల వెనక కారణం మీ మాటలే కదా.

ఓటమిలో నైరాశ్యంతో ఉన్న వ్యక్తి తారసపడితే "ఆ ఓటమితోనే జీవితం పూర్తయిపోలేదు. నువ్వు గెలిచే రోజు ముందుంది. జరిగిన దాంట్లో నీ పొరపాటు ఎక్కడుందో ఒక్కసారి గమనించుకో. దాన్ని సరి చేసుకుంటే తప్పకుండా గెలుస్తావు." అని భుజం తట్టి ఓదార్పునిస్తే రేపటి వారి గెలుపుకు నువ్వు చెప్పిన ఆ నాలుగు మాటలే కారణమవుతాయి కదా.

ఏం చేయాలో తోచని సందిగ్ధంలో ఉన్న వ్యక్తికి, ఆ విషయానికి సంబంధించిన పాజిటివ్ లు, నెగిటివ్ లు అన్నీ అర్థమయ్యేలా చెప్పి, నిర్ణయం మాత్రం తనకే వదిలివేయాలి. ఒక సరైన దారిని ఎంచుకునేలా చేసే ఆ నాలుగు మాటలు ఎంతో స్పష్టతనిస్తాయి కదా.

ఎదుటి వ్యక్తితో వాగ్వాదం జరిగే సందర్భం వచ్చినప్పుడు, ఆ సందర్భం గెలవడానికి ఏదైనా మాట్లాడేలా తొందరపడకు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడకు. అక్కడ నీ మాటలతో ఎదుటి వ్యక్తిని మాట్లాడలేకుండా చేసి సందర్భం గెలవగలుగుతావేమో కానీ ఎదుటి వ్యక్తి మనసుని మాత్రం ఎప్పటికీ గెలవలేవు.

మన మాటలతోనే కొత్త బంధాన్ని ఏర్పరచుకోవచ్చు, ఉన్న బంధాన్ని తెంచుకోనూవచ్చు. అందుకే మాట్లాడే ముందు కాస్త సహనంతో, ఆలోచించి మాట్లాడు. ఆ సందర్భం వ్యక్తుల తీవ్రమైన భావోద్వేగంతో నిండింది అయితే అక్కడ మాట్లాడకపోవడమే మంచిది. ఒక్కోసారి మాటల కన్నా మౌనమే నిన్ను గెలిపిస్తుంది.

ఒక్కోసారి ఆవేశంలో ఎవరినైనా, ఏ మాటైనా అనే పరిస్థితి వచ్చి, వారి మనసు నొచ్చుకునే మాటలు మాట్లాడితే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరండి. ఎందుకంటే వారికి ఆ మాటల తాలూకు గాయం మానినా కూడా, నొప్పి జీవితాంతం మిగిలిపోతుంది. దెబ్బ వేసే హక్కు ఉన్నప్పుడు వెన్న రాసే బాధ్యత కూడా తీసుకోవాలి.

చివరిగా ఒక్కమాట:

బాధలో ఓదార్పునిచ్చే ఓ మాట

నిరాశలో ధైర్యం నింపేలా ఓ మాట

పొందిన సాయానికి కృతజ్ఞత తెలిపే ఓ మాట

మనం గుర్తొస్తే ఎదుటి వారి ముఖంపై చిరునవ్వు కలిగేలా ఓ మాట

ఇవే కదా నేస్తం మాటలంటే..

హృదయాన్ని హత్తుకునే భాషంటే...

M. Jaya Krishna Reddy

M.S. (Counselling & Psychotherapy)

Motivational Speaker

Cell: 9640 21 55 41

ఇవి కూడా చదవండి