నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీటి విడుదల.. కాలువల పనులు పూర్తయ్యేందుకు మరో మూడు నెలలు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21: నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయడంతో మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో అదనంగా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి రానుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. నార్లాపూర్, ఎల్లూరు రిజర్వాయర్ల నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ద్వారా కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటి సదుపాయం కలగనుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల నిర్లక్ష్యం
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించారని జూపల్లి విమర్శించారు. ప్రాజెక్టులను పూర్తిచేయకుండా అసంపూర్తిగా వదిలేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో నిలిచిపోయిన పనులను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.
మరో మూడు నెలల్లో కాలువల పనులు పూర్తి
నార్లాపూర్ నుంచి ఏదుల వరకు కాలువల తవ్వకం, బ్రిడ్జిల నిర్మాణం వంటి కీలక పనులు ఇంకా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. మార్గమధ్యంలో మూడు చోట్ల తవ్వకాలు చేపట్టాల్సి ఉందని, కొన్ని ప్రాంతాల్లో రాతి నేల ఉండటంతో పనులు పూర్తి చేయడానికి సమయం పడుతోందని చెప్పారు.
కాలువల నిర్మాణం, బ్రిడ్జిల పనులు పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే అది మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.
వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలు ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోకుండా విమర్శలు చేస్తున్నారని జూపల్లి అన్నారు. నిర్మాణ పనులు పూర్తికాకుండా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. ప్రాజెక్టుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. గాలి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.






