Thursday22 October 2026Hyderabad

SENSEX73,561-1.02%
NIFTY22,784-0.93%
HYD 22K₹1,33,156/10g-1.42%
Languages

Latest News

ఘనంగా సిందూర్ ఖేలా వేడుకలు బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సందడి

nagendra22 October 2026, 2:17 AM6 viewstrinetnews.com
ఘనంగా సిందూర్ ఖేలా వేడుకలు బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సందడి

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20:

బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ (బీసీఏ) హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 53వ సార్వజనిన్ దుర్గాపూజ ఉత్సవాల్లో భాగంగా విజయదశమి సందర్భంగా సిందూర్ ఖేలా వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బెంగాలీ మహిళలతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

సంప్రదాయ దుస్తుల్లో హాజరైన మహిళలు అమ్మవారికి సింధూరం, తమలపాకులు, మిఠాయిలు సమర్పించారు. అనంతరం ఒకరికొకరు సింధూరం పూసుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు. మహిళల ఆనందోత్సాహాలు, ఆత్మీయ పలకరింపులతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది.

బీసీఏ అధ్యక్షుడు సంజయ్ పాన్ మాట్లాడుతూ, వేడుకల్లో పాల్గొనే మహిళా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బీసీఏ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, పీఆర్వో డాక్టర్ త్రిషీతా ముఖర్జీ మాట్లాడుతూ, ఆరు రోజుల దుర్గాపూజ ఉత్సవాల్లో సిందూర్ ఖేలా ప్రత్యేకమైన, భావోద్వేగాలతో కూడిన సంప్రదాయమని పేర్కొన్నారు. బెంగాలీ సంస్కృతి గొప్పతనానికి ఈ వేడుక ప్రతీకగా నిలుస్తుందన్నారు. అమ్మవారు తన దివ్యధామానికి తిరిగి వెళ్తున్నారనే బాధ ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది మళ్లీ వస్తారనే విశ్వాసంతో వీడ్కోలు పలుకుతామని తెలిపారు.

బీసీఏ సీనియర్ సభ్యుడు రంజిత్ పాల్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా దుర్గాపూజ ఉత్సవాలను నిర్వహిస్తున్న సంస్థల్లో బీసీఏ ఒకటని చెప్పారు. తమ పండల్‌కు వచ్చే మహిళలు, భక్తులకు అమ్మవారి దర్శనంతోపాటు సిందూర్ ఖేలా సంప్రదాయంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.

Also read