Thursday22 October 2026హైదరాబాద్

SENSEX73,613-0.94%
NIFTY22,735-1.14%
HYD 22K₹1,33,050/10g-1.60%
भाषाएँ

Latest News

విమర్శ కుంగుబాటుగా మారకూడదు. పరిశీలనగా మార్చుకో.. పరిహాసానికి లొంగిపోకు.

nagendra22 October 2026, 2:12 AM4 व्यूtrinetnews.com
విమర్శ కుంగుబాటుగా మారకూడదు. పరిశీలనగా మార్చుకో.. పరిహాసానికి లొంగిపోకు.

Share this story

Share link keeps your language (?lang=)

  • ట్రైనెట్ న్యూస్ ప్రత్యేక కథనం

ఒక టూత్ పేస్ట్ తయారీ కంపెనీలో ఉద్యోగులతో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆ ఉద్యోగుల యొక్క ఉన్నతాధికారి ఒకరు ఇలా వివరిస్తున్నారు. "మన కంపెనీ తయారు చేసే టూత్ పేస్ట్ జనాల్లోకి మరింతగా చేరవేర్చేలాగా కంపెనీ ఒక ప్రణాళిక రూపొందించింది. దాని ప్రకారం మీలో ప్రతి నలుగురు ఒక జట్టుగా ఏర్పడి, రేపు ఉదయం 8 గంటలకల్లా ప్రతి జట్టుకి అప్పగించిన ఊరికి చేరుకోవాలి. ఆ ఊరిలో వివిధ వయసుల వారిగా ప్రజలను కలిసి, మన కంపెనీ నుంచి తయారయ్యే టూత్ పేస్టులకు సంబంధించి వారికి సమాచారం ఉందా? అవి ఎప్పుడైనా వాడారా? అందులో వారికి నచ్చని అంశాలు ఏంటి? నచ్చిన అంశాలు ఏంటి? మన టూత్ పేస్ట్ నుండి ఇంకా ఎలాంటి మార్పులు వారు కోరుకుంటున్నారు? అనే సమాచారాన్ని సేకరించండి. ఆ సమాచారాన్ని అంతా రేపు ఉదయం తిరిగి ఆఫీసులో మనందరం కలిసి చర్చిద్దాం. ఆ చర్చల ద్వారా మనందరం కలిసి, ఒక నిర్ణయం తీసుకుందాం." అని చెప్పారు.

ఇది వినగానే ఉద్యోగులందరూ ఒకరితో ఒకరు గుసగుసలాడటం మొదలుపెట్టారు. వారు ఏం చర్చించుకుంటున్నారో అర్థం కాక ఆ ఉన్నతాధికారి "ఈ ప్రణాళిక పట్ల మీకేమైనా అభ్యంతరాలు ఉంటే నాతో చెప్పండి" అని అడిగారు.

వెంటనే ఆ ఉద్యోగుల నుండి ఉన్నతాధికారికి

"ఉదయం 8 గంటలకే ఆ ఊరికి ఎలా చేరుకోగలుగుతాం?" అని ఒకరు, "మా టీంలో నలుగురేనా? ఐదుగురు ఉంటే బాగుండేదేమో కదా" అని ఒకరు, "మేము వెళ్లిన ఊరిలో మేము అడిగిన సమాచారం అక్కడున్న ప్రజలు ఇస్తారా? అసలు మమ్మల్ని నమ్ముతారా?" అని ఒకరు, "ఆ ఊర్లో సమాచారం అంతా సేకరించిన తర్వాత మరుసటి రోజు ఆఫీసుకి రావాలా? అలసిపోతామేమో ఒక రోజు ఎందుకు సెలవు ఇవ్వట్లేదు?" ఇలా ఒకరు చెప్తూ ఉంటే ఆ ఉన్నతాధికారి ఆశ్చర్యపోయాడు.

అసలు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కంపెనీ యొక్క ఉత్పత్తులను పెంచడం కానీ ఆ విషయం తప్ప ఇతరత్రా అన్ని విషయాల పట్ల ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇది గమనించి ఆ ఉన్నతాధికారి ఉద్యోగులతో ఇలా అన్నారు. "ఈ ప్రణాళికకు సంబంధించి విమర్శలు ఉన్న వారంతా చేతులు ఎత్తండి." అని. దాదాపుగా 80% మంది ఉద్యోగులు చేతులెత్తారు. "మీ విమర్శలతో పాటు, మరి మన కంపెనీ ఉత్పత్తుల వినియోగం పెరిగేలా ప్రణాళికలో ఏమేం మార్పులు బాగుంటుంది? అనే సలహా కూడా మిగతా ఉద్యోగులకి అర్థమయ్యేలా చెప్పగలిగిన వారు మాత్రమే చేతులెత్తండి" అని అడిగారు ఆ ఉన్నతాధికారి. రెండు నిమిషాల్లో అందరూ ఉద్యోగులు చేతులు కిందకి దించేశారు.

ఈ కథలో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, తప్పులు వెతికి మరీ మనల్ని విమర్శించే వారు చాలా మంది మన చుట్టూనే ఉంటారు. క్రికెట్ ఆడే 11మంది ఎలా ఆడుతున్నారో, ఎలా ఆడితే మ్యాచ్ గెలిచేదో, ఎందువల్ల ఓడిపోయిందో చెప్పడానికి లక్షల మంది ఉంటారు. కానీ వాళ్ళు ఎవరూ కూడా ఆ 11 మందిలాగా నైపుణ్యంతో ఆడడానికి ముందుకు రారు. ఆ 11 మందికి ఆ విషయంలో సహాయం కూడా చేయరు. కేవలం విమర్శ చేస్తూ వెనకే ఉంటారు.

మనం ఒకసారి మన గ్రాడ్యుయేషన్(డిగ్రీ) సర్టిఫికెట్ ని పరిశీలిస్తే అందులో విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఉన్నతాధికారి సంతకం ఉంటుంది. అంటే మనం గ్రాడ్యుయేట్ చేసినట్టుగా ఆ ఉన్నతాధికారి ధ్రువీకరించినట్టు లెక్క. మనం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు ధ్రువీకరించిన వ్యక్తి మనకన్నా పై స్థాయి అధికారి అన్నట్టే కదా. మరి అలాంటప్పుడు మన ఆలోచన లేదా మనం చేసిన పని మంచిదా చెడ్డదా అని విమర్శ చేసే వ్యక్తి మాత్రం ఆలోచన పరంగా, వ్యక్తిత్వ పరంగా మనకంటే పై స్థాయి వ్యక్తి కానవసరం లేదా? ఎవరు పడితే వారు చేసే విమర్శను మనం ఎందుకు స్వీకరించాలి? అలాంటి విమర్శలు అన్నింటికీ నువ్వు స్పందించి, సమాధానం ఇవ్వడం మొదలుపెడితే, విమర్శలు ఇంకా వస్తూనే ఉంటాయి. నువ్వు సమాధానం చెప్తూనే ఉంటావు.

గురుత్వాకర్షణ శక్తికి లోనై స్వేచ్ఛగా కదిలే వస్తువు తనపై పడే వాయువు ఒత్తిడికి గనక లోనైతే ఆ వస్తువు దిశ, గమ్యం రెండూ మారిపోతాయి.

అలాగే ఒక లక్ష్యం (గురుత్వాకర్షణ శక్తి) కోసం ఒక ప్రణాళికతో ముందుకెళ్లే వ్యక్తి తన గురించి ఏ మాత్రం తెలియని లేదా తన గెలుపు సహించని ఇతరుల విమర్శలకు (వాయువు ఒత్తిడికి) లోనై బాధ పడితే, తన ప్రణాళికలో తడబడి, లక్ష్యానికి దూరమవుతాడు.

ఆ విమర్శలు అన్నిటిలో, నిజంగా నీ గురించి, నీ సామర్థ్యం గురించి తెలిసి, మనస్పూర్తిగా నీ బాగు కోరి, నువ్వు మార్చుకోవాల్సిన నీ ఆలోచన లేదా ప్రవర్తన గురించి చెప్పిన సద్విమర్శను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మిగతా విమర్శలు అన్నింటిని నువ్వు మనసుదాకా తీసుకుని బాధపడి నీ ఆత్మ విశ్వాసం కోల్పోకు. వాటిగురించే ఆలోచిస్తూ ఉంటే జీవితంలో ముందుకు వెళ్లలేవు.

నువ్వు పరుగులు సరిగ్గా తీయక మ్యాచ్ ఓడిపోయినప్పుడు నిన్ను విమర్శించిన నోళ్ళన్నీ, మరొక మ్యాచ్ లో నువ్వు చేసిన పరుగుల ద్వారా నీ జట్టు గెలిచినప్పుడు వాటంతటవే మూతపడతాయి. కేవలం నీ గెలుపే అలాంటి విమర్శలు అన్నిటికీ సమాధానం కావాలి.

చివరిగా ఒక్కమాట:

ఎంత నిజాయితీగా ఉన్నా విమర్శించే వాళ్లుంటారు.

ఎంత మూర్ఖంగా ఉన్నా పొగిడే వాళ్లుంటారు.

వారి ఆశలు, అవసరాలే వాటికి మూలం.

వారి అభిప్రాయాల అద్దంలో

నీ వ్యక్తిత్వం చూసుకోకు మిత్రమా...

M. Jaya Krishna Reddy

M.S. (Counselling & Psychotherapy)

Motivational Speaker

Cell: 9640 21 55 41

यह भी पढ़ें