Thursday22 October 2026హైదరాబాద్

SENSEX73,468-1.14%
NIFTY22,745-1.10%
HYD 22K₹1,33,257/10g-1.35%
भाषाएँ

Latest News

యువ కళాకారుల ప్రతిభకు విస్తృత అవకాశాలు కల్పించాలి లలిత కళా అకాడమీ అవార్డుల ప్రదానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

nagendra22 October 2026, 2:09 AM2 व्यूtrinetnews.com
యువ కళాకారుల ప్రతిభకు విస్తృత అవకాశాలు కల్పించాలి లలిత కళా అకాడమీ అవార్డుల ప్రదానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Share this story

Share link keeps your language (?lang=)

  • న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21:

యువ, వర్ధమాన కళాకారులు తమ ప్రతిభను అభివృద్ధి చేసుకునేందుకు, నూతన మాధ్యమాల్లో ప్రయోగాలు చేసేందుకు విస్తృత అవకాశాలు కల్పించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 65వ జాతీయ కళా ప్రదర్శనకు ఎంపికైన కళాకారులకు లలిత కళా అకాడమీ అవార్డులను ప్రదానం చేశారు. మూడో ప్రింట్ బియన్నాలే ఇండియా–2026 గ్రాండ్ ప్రైజ్ విజేతలను, ప్రత్యేక ప్రశంసలు పొందిన కళాకారులను కూడా సత్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఈ పురస్కార ప్రదానోత్సవం భారతీయ కళా వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం, సమకాలీన సృజనాత్మకతకు వేడుకగా నిలుస్తోందన్నారు. కళ అనేది చిత్రాలు, శిల్పాలు, ఇతర మాధ్యమాల్లో రూపొందించిన కృతులకే పరిమితం కాదని, మన సంస్కృతికి ప్రతిబింబమని పేర్కొన్నారు. గత జ్ఞాపకాలు, వర్తమాన అనుభవాలు, భవిష్యత్తు ఆకాంక్షలను కళ ఆవిష్కరిస్తుందని తెలిపారు. సమాజాన్ని, మన కాలాన్ని కొత్త దృక్కోణంలో అర్థం చేసుకునేందుకు కళ దోహదపడుతుందన్నారు.

మారుమూల ప్రాంతాల్లోని సంప్రదాయ కళాకారులకు నూతన సాంకేతికతలు, సమకాలీన కళా పద్ధతుల్లో శిక్షణ అందించాలని సూచించారు. తద్వారా వారు విస్తృత వేదికలపై తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతోపాటు పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు.

కళాకారులకు సృజనాత్మక అవకాశాలతోపాటు ఆర్థిక సహాయం, విస్తృత మార్కెట్ సదుపాయం, కళా సేకరణదారులతో పరిచయాలు అవసరమని రాష్ట్రపతి పేర్కొన్నారు. కళాఖండాల విక్రయాలను ప్రోత్సహించేందుకు లలిత కళా అకాడమీ, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని అభినందించారు.

కళ గ్యాలరీలకే పరిమితం కాకుండా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, సమాజంలోని విస్తృత వర్గాలకు చేరాలని ఆకాంక్షించారు. యువ కళాకారుల సృజనాత్మక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సంబంధిత వర్గాలన్నీ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

यह भी पढ़ें