సుమారు 1.3 లక్షల చదరపు అడుగుల స్థలం వినియోగంలోకి
న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21:
స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం–6.0లో భాగంగా వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం (డేర్), భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ చర్యల ద్వారా సుమారు 1.3 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేసి, వినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.
అక్టోబర్ 2 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ప్రచారంలో ఐసీఏఆర్‌తోపాటు దాని పరిధిలోని 114 సంస్థలు, ప్రాంతీయ కేంద్రాలు, వ్యవసాయ సాంకేతిక అనువర్తన పరిశోధనా సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు పాల్గొంటున్నాయి. కార్యాలయాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పద్ధతుల ప్రోత్సాహానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా సంస్థ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలతో ప్రచారాన్ని ప్రారంభించారు. న్యూఢిల్లీలోని పూసా జాతీయ వ్యవసాయ విజ్ఞాన సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐసీఏఆర్ ప్రధాన కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించారు.
పరిశుభ్రమైన పని ప్రదేశాలను తీర్చిదిద్దడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, నిరంతర పరిశుభ్రతను అలవాటుగా మార్చడం లక్ష్యంగా ఈ ప్రచారం కొనసాగుతోంది.





