Thursday22 October 2026Hyderabad

SENSEX73,600-0.96%
NIFTY22,703-1.28%
HYD 22K₹1,33,249/10g-1.31%
Languages

Latest News

శాంతిభద్రతలే అభివృద్ధికి పునాది.. పోలీసింగ్‌లో టెక్నాలజీకి పెద్దపీట: సీఎం చంద్రబాబు

nagendra22 October 2026, 1:59 AM2 viewstrinetnews.com
శాంతిభద్రతలే అభివృద్ధికి పునాది.. పోలీసింగ్‌లో టెక్నాలజీకి పెద్దపీట: సీఎం చంద్రబాబు

Share this story

Share link keeps your language (?lang=)

అమరావతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21:

శాంతిభద్రతలు, అభివృద్ధి, ఉపాధి, ప్రజల సుఖసంతోషాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భద్రతపై నమ్మకం ఉన్నచోటే పెట్టుబడులు వస్తాయని, పరిశ్రమలు ఏర్పాటవుతాయని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసుల సేవలను కొనియాడారు.

పోలీసు వృత్తి ఎంతో గొప్పది

మాతృభూమి రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని చంద్రబాబు పేర్కొన్నారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ పది మంది పోలీసులు వీరమరణం పొందారని, వారి త్యాగానికి గుర్తుగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. ఖాకీ అంటే బాధ్యత.. పోలీసు అంటే భరోసా అని అభివర్ణించారు. ప్రమాదం జరిగినా, నేరం చోటుచేసుకున్నా ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులేనని అన్నారు. ఎల్లప్పుడూ విధుల్లో ఉంటూ ప్రజల కోసం సేవలందించే విభాగం పోలీసు శాఖ అని పేర్కొన్నారు. దుర్గగుడి శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాల నిర్వహణ నుంచి వీఐపీల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ వరకు పోలీసుల పాత్ర కీలకమని చెప్పారు. ప్రజల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేందుకు పోలీసులు తమ కుటుంబాల పండుగలకు దూరంగా ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు. అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకోవడం కేవలం సానుభూతి కాదని, అది సమాజ బాధ్యతని స్పష్టం చేశారు.

ఏపీ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు

క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలో, నేరాలను ఛేదించడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు మంచి ట్రాక్ రికార్డు ఉందని సీఎం అన్నారు. గతంలో ఫ్యాక్షన్‌ను నియంత్రించడం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, మత కలహాలను అరికట్టడంలో పలువురు అధికారులు, సిబ్బంది అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని గుర్తుచేశారు.

ఇటీవల ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దేశ రక్షణకు భంగం కలిగించే కుట్రలను ఛేదించిందని తెలిపారు. ఈ చర్యలతో ఏపీ పోలీసుల ప్రతిష్ట మరింత పెరిగిందని, దేశ భద్రతలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని అభినందించారు.

పోలీసింగ్‌లో మానవత్వం ముఖ్యం

పోలీసు విధుల్లో ధైర్యం ఎంత అవసరమో మానవత్వం కూడా అంతే అవసరమని చంద్రబాబు అన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి వ్యక్తి తన సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో వస్తారని, కొందరు భయంతో, మరికొందరు కన్నీళ్లతో వస్తారని పేర్కొన్నారు. వారి సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలని సూచించారు. పోలీసు యూనిఫాం బాధితులకు అభయాన్ని ఇవ్వాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కాలని అన్నారు. పోలీసుల తక్షణ స్పందన ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని, ప్రతి చర్య పోలీసు శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా ఉండాలని సూచించారు. నేరస్థుడికి ఖాకీని చూస్తే భయం కలగాలని, బాధితుడికి పోలీసులంటే నమ్మకం ఏర్పడాలని స్పష్టం చేశారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

నేరాలు చేసే పద్ధతులు మారుతున్న నేపథ్యంలో దర్యాప్తు విధానాలు కూడా మారాలని సీఎం సూచించారు. ఒక్క ఫోన్ కాల్, ఒక్క లింక్ లేదా ఒక్క మెసేజ్‌తో జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్నవారు సైతం సైబర్ మోసాల బారిన పడుతున్నారని పేర్కొంటూ, ఇలాంటి నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఆధునిక దర్యాప్తు పద్ధతులను అనుసరించాలని అన్నారు.

రాజకీయ ముసుగులో జరిగే నేరాలను సహించకూడదని, రాజకీయాలు నేరస్థులకు రక్షణ కల్పించకూడదని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీలపై కఠినంగా వ్యవహరించాలని, సోషల్ సైకోలుగా మారి సమాజంలో అలజడి సృష్టించే వారిని ఉపేక్షించకూడదని పోలీసులకు సూచించారు.

ఏపీ పోలీస్ అంటే టెక్నాలజీలో టాప్ కావాలి

నేరాన్ని ఛేదించడం పోలీసుల సమర్థతకు నిదర్శనమైతే, నేరం జరగకుండా నివారించడం అత్యుత్తమ పోలీసింగ్‌కు గుర్తింపు అని చంద్రబాబు పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు నేరాల దృశ్యాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయని, డేటా విశ్లేషణ ద్వారా నేరాల వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవచ్చని చెప్పారు. డ్రోన్లు పోలీసుల నిఘా పరిధిని పెంచుతాయని, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత విశ్లేషణ దర్యాప్తు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని వివరించారు. దేశవ్యాప్తంగా ‘ఏపీ పోలీస్ అంటే టెక్నాలజీలో టాప్’ అనే గుర్తింపు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పిస్తూ, ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరాల నివారణకు పోలీసులు మరింత సమర్థంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Also read