గురువారం22 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,309-1.36%
NIFTY22,612-1.68%
22K₹1,32,978/10g-1.31%
భాషలు

తాజా వార్తలు

ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలి.. తాగునీటికి తొలి ప్రాధాన్యం: మంత్రి సీతక్క

nagendra22 October 2026, 1:58 AM2 చూసులుtrinetnews.com
ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలి.. తాగునీటికి తొలి ప్రాధాన్యం: మంత్రి సీతక్క

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రామప్ప చెరువులో 29 అడుగుల నీటి నిల్వ.. పంపింగ్ ద్వారా సరఫరాకు చర్యలు

ఉపాధి హామీ పనులతో నీటి సంరక్షణ నిర్మాణాలు

ములుగు, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21:

ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత పెరిగి, వర్షాలు తగ్గే పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టడంతో పాటు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నీటి సంరక్షణ, తాగునీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని రామప్ప చెరువు, డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టును మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి నిల్వలు, తాగునీటి సరఫరా పరిస్థితి, భవిష్యత్తులో నీటి అవసరాలను తీర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

రామప్ప నుంచి నీటి సరఫరాకు చర్యలు

రామప్ప చెరువులో ప్రస్తుతం 29 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గోదావరి నుంచి నీటిని పంపింగ్ చేసి చెరువులు, పరిసర ప్రాంతాలకు నీటి సరఫరాను మెరుగుపరిచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. నీటి నిల్వలు పెంచుకునేందుకు వీలుగా, ఏటా పాటించే విరామాన్ని దృష్టిలో ఉంచుకుని మరో రెండు రోజుల్లో నీటిని విడుదల చేసేలా సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు. రామప్ప చెరువు నుంచి నీటిని డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసి ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, మల్లంపల్లి పరిసర ప్రాంతాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీటి సరఫరా వ్యవస్థలు, చెరువులపై ఆధారపడిన గ్రామాలు, భూగర్భ జలాల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు తగవు

అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి పరిణామాలను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని మంత్రి సీతక్క అన్నారు. ఇలాంటి పరిస్థితులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉష్ణోగ్రతల మార్పులు వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు.ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు రాజకీయ విమర్శల కంటే సమష్టి కార్యాచరణ అవసరమని స్పష్టం చేశారు. ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఉపాధి హామీతో నీటి సంరక్షణకు ప్రాధాన్యం

వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, బోర్ల రీచార్జ్ వంటి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీతక్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

గ్రామాల్లో కూలీల సంఖ్యను పెంచి, ఉపాధి హామీ పథకం ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచులు, గ్రామస్థులకు పిలుపునిచ్చారు. వర్షాలు కురిసినప్పుడు నీటిని వృథాగా వెళ్లనివ్వకుండా నిల్వ చేసుకునే నిర్మాణాలను ఇప్పటి నుంచే చేపడితే భవిష్యత్తులో నీటి ఎద్దడి తీవ్రతను తగ్గించవచ్చని అన్నారు.

తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యం

సాగునీటి అవసరాలతో పాటు ప్రజలకు తాగునీరు అందించడమే అత్యంత ముఖ్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న పరిస్థితుల్లో ప్రతి చుక్కను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, నీటిని వృథా చేయకుండా ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

రామప్ప–లక్నవరం కాలువ వంటి ప్రతిపాదిత ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రత్యామ్నాయ నీటి వనరులను అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. నీటి సంరక్షణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యంతోనే నీటి భద్రత సాధ్యమవుతుందని పేర్కొంటూ ఈ ప్రయత్నాలకు అందరూ సహకరించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి