Sunday18 October 2026Hyderabad

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g+0.09%
Languages

Latest News

" పైన పటారం ....లోన లొటారం "

nagendra18 October 2026, 3:00 AM0 viewstrinetnews.com
" పైన పటారం ....లోన లొటారం "

Share this story

Share link keeps your language (?lang=)

ట్రైనెట్ న్యూస్ శశిమోహన కాంతి కిరణం...

పైకి చాలా చాలా గొప్పగా ఆడంబరంగా, అతిశయంగా కనపడుతూ.... లోపల మాత్రం ఏమీ లేకుండా ఉండటాన్నే " పైన పటారం లోన లొటారం " అంటారు.

ఈ రోజుల్లో మనుషులు తాము జీవించడం కంటే ఇతరుల కోసం బ్రతకటం, ఇతరుల కోసం మాట్లాడటం , ఇతరుల కోసం ఆడంబరాలకు పోవడం బాగా ఎక్కువైంది. కొందరు సమాజంలో తమకంటూ ప్రత్యేకత ఉన్నదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

వారికి ఏమీ రాకున్నా మహాకవులమని చెప్పుకుంటూ తిరుగుతారు. సన్మానాలు పొందుతారు. ఏమీ లేకున్నా మేము అంతవారం , ఇంతవారం అంటూ కోతలు కోస్తుంటారు.

అప్పులు చేసైనా సరే, పెద్ద పెద్ద ఇళ్ళు కొనడం, ఆస్తులు ఏర్పరచుకోవడం, విలాసవంతమైన కార్లలో తిరగటం, ఖరీదైన బట్టలు ధరించటం , నగలు ధరించడం లాంటివి చేసి జనాల కళ్ళల్లో దుమ్ము కొడుతూ ఉంటారు. కొందరైతే చెల్లని చెక్కులు ఇచ్చి దానాలు చేయటం,

బినామీ భూములను దానం చేయడం లేదా అమ్మటం లాంటివి చేస్తూ సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్ లాంటి అంతర్జాల వేదికలపై రకరకాల ఫోటోలు పెట్టి తాము ఎంతో గొప్ప వారమైనట్లు కృత్రిమ హోదాను ప్రదర్శిస్తూ ఉంటారు.

ఇంకా కొంతమంది మాటల్లో ఎంతో సంస్కారవంతులుగా ,నీతిమంతులుగా నటిస్తూ లోపల మాత్రం కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థంతో నిండి ఉంటారు.

బయట కనిపించే రూపానికి లోపల ఉండే గుణానికి ఎంతో వ్యత్యాసం ఉందని ఈ సామెత విశదీకరిస్తున్నది.

మనం బయట ప్రపంచంలో ఎన్నో చూస్తున్నాం. ఎంతోమంది వేదికలపై గంటలు గంటలు మాట్లాడటం గురించి చూస్తున్నాం ,వింటున్నాం. చాలామంది వేదికల మీద నీతి నియమాల గురించి, సమాజ శ్రేయస్సు గురించి గంటలు తరబడి ఉపన్యాసాలు ఇస్తారు. కానీ వారి వ్యక్తిగత జీవితంలో లేదా వారి నిజ స్వరూపంలో తాము చెప్పే దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తారు. కొంతమంది మాటల్లో ఆదర్శమూర్తులుగా ఉన్నా, ఇంటిలో వారి తీరు ఆ నాలుగు గోడలకే తెలుసు వారెంత క్రూరాత్ములని. ముసుగులో ఉన్న వారి అసలు రూపం బహిర్గతమైనప్పుడు, లోకం వారిని అసహ్యించుకుంటుంది. ఆ ప్రభావం వారి మీదే కాదు, అన్నెం పున్నెం ఎరుగని వారి కుటుంబ సభ్యుల పైన కూడా బాగా పడుతుంది. వారితో సంబంధం బాంధవ్యాలు పెంచుకోవటానికి భయపడతారు.

ఈ వ్యాసం యొక్క సారాంశం ఏమిటంటే....

కంటికి కనిపించే ప్రతిదీ నిజం కాదు. కేవలం బాహ్య రూపం, బాహ్య సౌందర్యాన్ని ఆడంబరాలని చూసి ఒకరి జీవితాన్ని అంచనా వేయకూడదు అనే సందేశాన్ని తెలియజేస్తున్నది. ప్రదర్శనల కోసం కాకుండా మనస్ఫూర్తిగా ,ప్రశాంతమైన నిజాయితీతో కూడిన జీవితాన్ని గడపటం ఉత్తమం అని ఈ వ్యాసం ద్వారా నేను తెలియజేస్తున్నాను. కపట ముసుగులు ధరించి బ్రతికే జీవితం ఎంతో కాలం సాగదు. ఎప్పటికైనా నిజం అనేది బయటపడక మానదు. కాబట్టి ఆడంబరాలకు, నటనకు దూరంగా ఉంటూ నిజాయితీతో కూడిన అంతరంగాన్ని కలిగి ఉండటమే మనిషికి నిజమైన అందమనే సత్యాన్ని గ్రహించాలి.

ఈ సామెత కేవలం మనుషుల తత్వాల మీదే కాదు.

నేటి వ్యాపార ప్రపంచానికి కూడా వర్తిస్తుంది. మార్కెట్లో అనేక వస్తువులు దొరుకుతున్నాయి .ఎంతో ఆకర్షణీయంగా రంగు రంగులుగా ఉంటాయి. ప్రకటనలు చూసి మనం ఆ వస్తువులను కొనుగోలు చేసి మోసపోతాం. వాడి చూస్తే గాని వాటిల్లోని నాణ్యత అర్థం కాదు. అందుకే మిత్రులారా ఏ పని చేసినా, ఏ వస్తువు కొన్నా, ఎవరిని నమ్మినా ఆచితూచి అడుగులు వేయాలి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

శశిబాల

Also read