Sunday18 October 2026Hyderabad

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g+0.09%
Languages

Latest News

గ్లోబల్ సమ్మిట్ లో ప్రముఖులందరూ పాల్గొనేలా చూడాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

nagendra18 October 2026, 2:48 AM0 viewstrinetnews.com
గ్లోబల్ సమ్మిట్ లో ప్రముఖులందరూ పాల్గొనేలా చూడాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,

అక్టోబర్ 17: డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో సమీక్షించారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు, ముఖ్యంగా కీలక భాగస్వాములకు ఆహ్వానాలు పంపించడం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడటంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి, అలాగే దానికి ముందస్తు కార్యక్రమాలుగా హైదరాబాద్‌లో ఈ నెల 24న, న్యూఢిల్లీలో ఈ నెల 29న నిర్వహించనున్న కార్యక్రమాలకు ఆహ్వానాల పంపిణీ స్థితిగతులను ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వానాలు పంపించినట్లు అధికారులు ఆయనకు వివరించారు.

ఏరోస్పేస్, అంతరిక్షం, రక్షణ రంగాలకు చెందిన సంబంధిత భాగస్వాములందరినీ ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానించాలని ప్రధాన కార్యదర్శి సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాల సాధనకు దోహదపడేలా ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు, ఆయా రంగాల నిపుణులు, ఇతర ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.

వివిధ దేశాల రాయబారులతో పాటు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి ), అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్ ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ ) వంటి ప్రముఖ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులను, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించాలని అధికారులకు సూచించారు.

ప్రముఖులందరూ కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆహ్వానాల ప్రక్రియను పకడ్బందీగా, సమగ్రంగా చేపట్టాలని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు తమ బాధ్యతగా భావించి, సంబంధిత భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ, ఆహ్వానితుల భాగస్వామ్యాన్ని నిర్ధారించేందుకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్, న్యూఢిల్లీలలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాలు నిర్దేశిత లక్ష్యాలను సాధించడంతో పాటు, పారిశ్రామిక రంగ ప్రముఖులు, అంతర్జాతీయ ప్రతినిధులు, ఇతర కీలక భాగస్వాముల మధ్య ఆశించిన స్థాయిలో పరస్పర భాగస్వామ్యం, చర్చలు జరిగేలా సూక్ష్మస్థాయి ప్రణాళికలు, సమర్థవంతమైన సమన్వయం అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.

Also read