Sunday18 October 2026Hyderabad

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g+0.09%
Languages

Latest News

వినడంలో వివేకం, నమ్మడంలో విచక్షణ విన్నవన్నీ నిజాలు కాకపోవచ్చు.. వివేచనతో ఆలోచించు.

nagendra18 October 2026, 2:47 AM0 viewstrinetnews.com
వినడంలో వివేకం, నమ్మడంలో విచక్షణ విన్నవన్నీ నిజాలు కాకపోవచ్చు.. వివేచనతో ఆలోచించు.

Share this story

Share link keeps your language (?lang=)

"మీ ఇద్దరి మధ్య గొడవై తను పుట్టింటికి వెళ్లిన ఈ పది రోజుల నుండి ఒక్కసారైనా నీకు ఫోన్ చేసిందా? తనకు నీ మీద అసలు ప్రేమ ఉందా?" అని అడిగింది తల్లి అతనితో. "మీ ఆవిడను మొన్న ఒక హాస్పటల్లో చూశాను. అబార్షన్ చేయించుకోవడానికి వచ్చినట్టుంది. మీకు పుట్టబోయే ఆ బిడ్డ తనకు అవసరం లేదేమో?" అని చెప్పాడు స్నేహితుడు అతనితో.

"మీ ఆవిడ, నేను చిన్నప్పటినుండి ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నాం. అప్పటి నుండే తను ఇతరులను పట్టించుకునేది కాదు. అందరితో గౌరవం లేకుండా మాట్లాడేది." అని చెప్పింది స్నేహితురాలు అతనితో. " ఆమె నీకు ఎలా నచ్చింది అసలు? పెళ్లి చూపుల నాడే వద్దని చెప్పాలనుకున్నా. కానీ నువ్వు ఏమనుకుంటావో అని చెప్పలేకపోయా. ఇలా అవుతుందని నేను ముందే ఊహించా" అని దగ్గరి బంధువు ఒకతను చెప్పాడు అతనితో.

ఈ మాటలు అన్నీ విన్న అతను ఇక ఆమెతో ఉండలేననే నిర్ణయానికి వచ్చి, విడాకుల కొరకు లాయర్ ను సంప్రదించాడు. ఆ లాయర్ గారు అతడి భార్యను కూడా పిలిపించి, తన భర్త చెప్పిన విషయాలు ఆమెకి వివరించి, అసలేం జరిగింది అని అడిగాడు. వాటన్నిటికీ ఆమె ఇలా సమాధానం ఇచ్చింది.

"చిన్నతనంలో తనతో పాఠశాలలో కలిసి చదివిన స్నేహితురాలు కన్నా నేను ఎక్కువ మార్కులు సాధించేదాన్ని అని నామీద అసూయ పెంచుకొని నాకు దూరమైంది. నా భర్తతో మనస్పర్ధలు వచ్చి మా తల్లిదండ్రులతో ఉన్న సమయంలో హఠాత్తుగా మా నాన్నగారికి గుండె నొప్పి రావడంతో హాస్పిటల్లో చేర్పించాము. రెండు స్టంట్స్ కూడా వేశారు. ఒక వారం రోజులు హాస్పటల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ సమయంలో నా భర్తకు ఫోన్ చేస్తే డబ్బు సహాయం కోసం ఫోన్ చేశా అని అపార్థం చేసుకుంటారేమోనని తనకి ఫోన్ చేయలేకపోయాను." అని చెప్పింది.

ఈ సమాధానాలు విన్న భర్త నోట మాట రాలేదు. తనకు ఎవరెవరో ఏమేమో చెప్తే వాటిని నమ్మడం వల్ల పరిస్థితి ఇక్కడిదాకా వచ్చింది. ఆ చెప్పుడు మాటలు విని నిర్ణయం తీసుకునే ముందు, తన భార్యతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటే వాస్తవాలు తెలిసేవి కదా. ఇద్దరి మధ్య దూరం పెరిగేది కాదు కదా. తన భార్యకి హాస్పిటల్ లో తోడుగా ఉండాల్సిన క్షణాలన్నీ ఆమె మీద ద్వేషంతోనే గడిచిపోయాయి.

యదార్థాలు వేరు.

వాటి వెనుక కారణాలు వేరు

కానీ ఎవరి కథా అల్లికలు వారివే.

విషయాల మీద సృజనాత్మక పోటీ. సమాధానాలు అవసరం లేదు ఎవరికీ..

వారి వారి అహం తృప్తి పడితే చాలు.

చుట్టూ ఉండేది ఇదే మిత్రమా.. ఎవరో నడిపే పడవలో ఎంత దూరం, ఎంతకాలం ప్రయాణిస్తావు.

ఏ ఇద్దరి వ్యక్తుల ఆలోచనలు ఒకేలా ఉండకపోవచ్చు, ప్రతీ సంఘటన అందరికీ ఒకేలా అర్థం అవ్వాలని లేదు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా అందులో ఎంత నిజం ఉందో, ఎంత కల్పితమో విచక్షణతో ఆలోచించాలి. ఆ మాటలు చెప్పిన వ్యక్తికి "ఆ మాటలు నీతో చెప్పాల్సిన అవసరం ఏముంది?" అని ఆలోచిస్తే ఆ విషయం మరింతగా అర్థం అవుతుంది. ఎవరేం చెప్పినా మనం విన్నంతకాలం చెప్పే వ్యక్తులు ఎదురవుతూనే ఉంటారు. అలాంటి మాటల పట్ల జాగ్రత్త సుమా..

తనకు సంబంధం లేని విషయాలకు, తన ఊహలను జోడించి, తన భావోద్వేగాన్ని కలిపి మరీ ఎదుటి వ్యక్తికి చేరవేసే మనుషులందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి.

అదట.. ఇదట..

అవునట.. అందుకేనట... అంటూ

ఇంకొకరి వెనుక మాట్లాడే ఈ మాటలే నీ గురించి నీ చెవిలో పడే ఒక రోజు వస్తుంది. జీవితమంతా వీటికే పోతే జ్ఞాపకాలలో ఇవే మిగిలిపోతాయి. అందులో నువ్వెక్కడుంటావు.. మేలుకో మిత్రమా ఇకనైనా..

పూర్తిగా తెలియని విషయాల గురించి అంతా తెలిసినట్టు మాట్లాడకు. ఎదుటి వ్యక్తుల జీవితాలని చులకనగా చూడకు.

M. Jaya Krishna Reddy

M.S.(Counselling & Psychotherapy)

Motivational Speaker

Cell: 9640 21 55 41

Also read