సింగరేణీయులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షల లేఖ
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 17:
బతుకమ్మ, దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి సుస్థిర భవిష్యత్తు కోసం కొత్త గనుల సాధన, థర్మల్, సోలార్ రంగంలో బహుముఖ విస్తరణకు ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మారుతున్న బొగ్గు మార్కెట్లో పోటీని ఎదుర్కొంటూ సంస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
భూగర్భ, ఉపరితల గనుల్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ కార్మికులు వెలికితీసే బొగ్గు తెలంగాణ విద్యుత్ అవసరాలకు, రాష్ట్ర అభివృద్ధికి చోదక శక్తి అని అన్నారు. ఎల్ నినో ప్రభావం వంటి వాతావరణ సవాళ్ల వేళ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా నిరంతరంగా జరిగేలా మరింత బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మారుతున్న బొగ్గు మార్కెట్లో ఇతర సంస్థలతో పోటీపడాలంటే నాణ్యమైన బొగ్గును సరసమైన ధరకు అందించడం, ఉత్పాదకత పెంచడం, అనవసర ఖర్చులను తగ్గించడం అవసరమని భట్టి విక్రమార్క అన్నారు. కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, యాజమాన్యం సమన్వయంతో పనిచేయాలని, యంత్రాలను పూర్తి పని గంటలు సమర్థంగా వినియోగించాలని సూచించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనలో భద్రతకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని, ప్రతి కార్మికుడు క్షేమంగా ఇంటికి చేరడమే తొలి విజయమని స్పష్టం చేశారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని భావితరాలకు మరింత బలంగా అందించేందుకు కొత్త గనుల సాధనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఒడిశాలోని నైనీ బొగ్గు గనికి అవసరమైన అనుమతులు సాధించి ఉత్పత్తి ప్రారంభించామని, తాడిచెర్ల-2 బ్లాక్‌కు మైనింగ్ లీజు పొందామని చెప్పారు. మణుగూరు ప్రకాశం ఖని ఓపెన్‌కాస్ట్-2 డిప్ సైడ్ బ్లాక్‌ను వేలం ద్వారా దక్కించుకున్నామని, సత్తుపల్లి-3, కోయగూడెం-3 బ్లాక్‌లను తిరిగి సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని వివరించారు. బొగ్గుతో పాటు విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, బంగారం, రాగి, ఇతర కీలక ఖనిజాల రంగాల్లోనూ సంస్థను విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి చర్యలు
కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఇటీవల నిర్వహించిన సమీక్షలో పలు ఆదేశాలు ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 250 నుంచి 300 డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలను వేగవంతం చేయాలని, మారు పేర్లకు సంబంధించిన సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించాలని సూచించినట్లు చెప్పారు. సింగరేణి భూముల్లో అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, కార్మికుల సొంతింటి కల నెరవేర్చేందుకు నెహ్రూ హౌసింగ్ కాలనీల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల స్థానంలో కొత్త నివాసాల నిర్మాణం, కార్మిక కాలనీల అభివృద్ధి, ఏరియా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, క్యాథ్ ల్యాబ్ సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు వివరించారు. ఆరు నెలలకొకసారి సేఫ్టీ కిట్లు పంపిణీ చేయాలని, పెర్క్స్, అలవెన్సులపై ఆదాయపు పన్నుకు సంబంధించిన కార్మికుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించినట్లు పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన రూ.1,754 కోట్ల నికర లాభాల్లో 34 శాతం, అంటే సుమారు రూ.596 కోట్లను కార్మికులకు లాభాల వాటా బోనస్‌గా పంపిణీ చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. అర్హులైన ప్రతి రెగ్యులర్ ఉద్యోగికి సగటున రూ.1,53,912 అందిందని, కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చెల్లించినట్లు చెప్పారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా అందించడం వారి కృషికి ఇచ్చే గుర్తింపని అన్నారు.
“సింగరేణి విస్తరణకు అవసరమైన చొరవ తీసుకోవడం మా బాధ్యత. సంస్థను శ్రమతో, ఐక్యతతో అత్యుత్తమంగా తీర్చిదిద్దడం మీ వంతు. ఈ సంస్థను మన పూర్వీకులు కష్టపడి నిర్మించారు. దాన్ని కాపాడి, మరింత అభివృద్ధి చేసి భావితరాలకు అందించడం మనందరి ఉమ్మడి బాధ్యత” అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.





