Sunday18 October 2026Hyderabad

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
HYD 22K₹1,36,320/10g+0.09%
Languages

Latest News

వాయు కాలుష్య నియంత్రణకు సాంకేతిక పరిష్కారాలు స్టార్టప్‌లతో కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ చర్చలు

nagendra18 October 2026, 2:31 AM0 viewstrinetnews.com
వాయు కాలుష్య నియంత్రణకు సాంకేతిక పరిష్కారాలు స్టార్టప్‌లతో కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ చర్చలు

Share this story

Share link keeps your language (?lang=)

  • తక్కువ ఖర్చుతో విస్తృతంగా అమలు చేయగల ఆవిష్కరణలకు ప్రాధాన్యం

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17:

ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌)లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తక్కువ ఖర్చుతో, విస్తృత స్థాయిలో అమలు చేయగల సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లు, ఆవిష్కరణ సంస్థల ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ‘స్వచ్ఛమైన గాలిలో భాగస్వామ్యం.. మనందరి బాధ్యత’ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

విధాన రూపకర్తలు, సాంకేతిక ఆవిష్కర్తల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఈ సమావేశం ముందస్తు చొరవగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అమలు చేయగల పరిష్కారాలతో విధానాల అమలులో ఏకరూపత, పాలనలో పారదర్శకత పెరుగుతాయని తెలిపారు. వాయు కాలుష్య నిర్వహణకు సంబంధించిన తొమ్మిది కీలక రంగాల్లో సమస్యలను ప్రస్తావించి, వాటికి అనుగుణంగా సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై చర్చించారు.

పరిశ్రమల ఉద్గారాల నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు, కాలుష్య నియంత్రణ పరికరాలు, వాహనాల పీయూసీ పరీక్షల్లో అక్రమాలకు తావులేని సాంకేతికత అవసరమని భూపేందర్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. పరిశ్రమల ఉద్గారాల సమాచారాన్ని ఆయా ప్లాంట్ల నిర్వహణ సమాచారంతో అనుసంధానించడం ద్వారా అవకతవకలను గుర్తించవచ్చన్నారు. ఇందుకు కృత్రిమ మేధ కీలకంగా ఉపయోగపడుతుందని చెప్పారు.

నగరవ్యాప్తంగా గాలి నాణ్యత పర్యవేక్షణ, స్థానిక కాలుష్య పటాల తయారీ, కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల గుర్తింపు, ముందస్తు అంచనాలపై సమావేశంలో చర్చించారు. కృత్రిమ మేధ, సెన్సర్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రిమోట్‌ సెన్సింగ్‌, సమాచార విశ్లేషణ ద్వారా కాలుష్య మూలాలను ఎప్పటికప్పుడు గుర్తించే అవకాశాలను ఆవిష్కర్తలు ప్రదర్శించారు. చెల్లుబాటయ్యే పీయూసీ ధ్రువపత్రాలు లేని వాహనాలు, నిర్దేశిత వయోపరిమితి దాటిన వాహనాల స్వయంచాలక గుర్తింపు పరిష్కారాలను వివరించారు.

నిర్మాణ, కూల్చివేత ప్రదేశాల్లో దుమ్ము నియంత్రణ, తక్కువ ఖర్చుతో యాంత్రిక రహదారి శుభ్రత, రోడ్లపై దుమ్ము తిరిగి గాలిలోకి లేవడాన్ని పర్యవేక్షించడం, గుంతలను వేగంగా మరమ్మతు చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. స్వచ్ఛమైన వాహనాల వినియోగంతోపాటు ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, వాహనాల రాకపోకలను మెరుగుపరచాలని మంత్రి సూచించారు.

పంట అవశేషాలు, పట్టణ ఘన వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు పర్యావరణ అనుకూల పరిష్కారాలపై స్టార్టప్‌లు దృష్టి సారించాలని కోరారు. వరి గడ్డిని సేకరించి, రవాణా చేసి జీవ ఇంధనం, కంపోస్టు, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌ తదితర ఉత్పత్తులకు వినియోగించడం ద్వారా బహిరంగ దహనాన్ని తగ్గించవచ్చని తెలిపారు. పంట అవశేషాల నిల్వకు సంబంధిత సంస్థల సమన్వయంతో మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి నిల్వ నమూనాలను రూపొందించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

విడివిడి సాంకేతిక పరిష్కారాలను సమగ్రంగా అనుసంధానించి, ఆర్థికంగా ఆచరణ సాధ్యమైన విధానాలుగా విస్తరించాలని మంత్రి సూచించారు. ఇప్పటికే అమలవుతున్న గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌, స్వచ్ఛ ఇంధనాలు, విద్యుత్‌ వాహనాల ప్రోత్సాహం వంటి చర్యలకు ఇవి తోడ్పడాలని పేర్కొన్నారు.

సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌, ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్‌ సింగ్‌ సిర్సా, కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, వాయు నాణ్యత నిర్వహణ కమిషన్‌, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Also read