న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16: :
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. గౌరీపూజతో ప్రారంభమైన ఈ వేడుకల్లో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్, స్పెషల్ సెక్రటరీ అద్వైత్ కుమార్ సింగ్, ఐఏఎస్ పాల్గొన్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణవాసులు తరలివచ్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళల ఆటపాటలతో భవన్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, పల్లె జీవనం, ప్రకృతి పట్ల మనకున్న ప్రేమను బతుకమ్మ పండుగ ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. అందరూ ఒకచోట చేరి, పాటలు పాడుతూ ఆనందాన్ని పంచుకోవడం ఈ పండుగ ప్రత్యేకత అని అన్నారు. ఢిల్లీలో ఉన్నప్పటికీ ఇటువంటి వేడుకలు తెలంగాణతో మన అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. పూలను సేకరించడం నుంచి బతుకమ్మలను అందంగా పేర్చడం వరకు మహిళలు ఎంతో శ్రద్ధ చూపుతారని, తమ ఆటపాటలతో పండుగకు జీవం పోస్తారని అన్నారు. అందమైన బతుకమ్మలను తీసుకువచ్చి వేడుకల్లో పాల్గొన్న మహిళలను అభినందించారు. పిల్లలకు మన పండుగలు, పాటలు, ఆచారాలను పరిచయం చేయడం ద్వారా సంస్కృతిని తరువాతి తరాలకు అందించాలని సూచించారు.
మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ జరిగింది.












