శనివారం17 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,320/10g-0.23%
భాషలు

తాజా వార్తలు

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు

nagendra17 October 2026, 4:09 AM0 చూసులుtrinetnews.com
మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

- విద్యార్థుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యం

- షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు

- న్యాయ, విద్యా, హోంశాఖలు, యూజీసీ భాగస్వామ్యంతో కసరత్తు

సచివాలయంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటి సమావేశం

-సమావేశానికి హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్మణ్ కుమార్

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16:

విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల హక్కులను పరిరక్షిస్తూ, కులం, సామాజిక నేపథ్యం ఆధారంగా వివక్షకు తావులేకుండా సమగ్ర చట్టాన్ని రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు’కు సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను మూడు నెలల్లోగా సిద్ధం చేసి సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీ (సీఎస్‌సీ)కి సమర్పించాలని స్పష్టం చేశారు. కమిటీ ఏర్పాటు నుంచి వివిధ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల వరకు ప్రతి దశను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని, ఎలాంటి జాప్యానికి తావివ్వరాదని సూచించారు.

తెలంగాణ సచివాలయంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన రోహిత్ వేముల తెలంగాణ బిల్లుపై సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీ రెండో సమావేశం జరిగింది. ప్రతిపాదిత బిల్లు రూపకల్పనకు అనుసరించాల్సిన విధానం, కమిటీ కూర్పు, న్యాయపరమైన అంశాలు, వివిధ వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. విద్యార్థుల హక్కులకు సమర్థవంతమైన రక్షణ కల్పించేలా చట్టాన్ని రూపొందించేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి అదికారులకు దిశానిర్దేశం చేశారు.

‘రోహిత్ వేముల చట్ట రూపకల్పన ప్రక్రియకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (ఎస్‌సీడీడీ) నాయకత్వం వహించాలని సూచించారు. అవసరమైన సంబంధిత శాఖలు, సంస్థలకు కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని, న్యాయశాఖను భాగస్వామిగా చేర్చాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ, హోంశాఖ, యూజీసీ తదితర సంస్థల భాగస్వామ్యంపై పరిశీలన జరపాలని సూచించారు. కమిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి, ముసాయిదా తయారీకి అవసరమైన కార్యాచరణను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.

రోహిత్ వేముల తెలంగాణ బిల్లు విషయంలో సమాజంలోని వివిధ వర్గాల నుంచి సమగ్ర సంప్రదింపుల ప్రక్రియ చేపట్టాలన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, న్యాయ నిపుణులు, పౌర సమాజ సంస్థలు, విద్యా రంగ నిపుణులు, ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపేందుకు ముందుగా జాబితా రూపొందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు సంబంధించిన అంశాలు, చట్ట అమలులో ఎదురయ్యే సవాళ్లను పరిగణనలోకి తీసుకొని ముసాయిదా సిద్ధం చేయాలని చెప్పారు. ప్రభుత్వ అధికారులతోపాటు నిపుణుల సంస్థల ప్రతినిధుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ అంశాలపై చర్చించిన అనంతరం న్యాయశాఖను కమిటీలో సభ్య శాఖగా చేర్చాలని, అయితే కమిటీకి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ నాయకత్వం వహించాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి ఇతర శాఖలు, నిపుణులు, సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు.

రోహిత్ వేముల తెలంగాణ బిల్లుకు అవసరమైన న్యాయపరమైన, సాంకేతిక అంశాల్లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం సహకారం తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. నిబంధనల రూపకల్పనలో సహకరించేందుకు నల్సార్ విశ్వవిద్యాలయం అంగీకరించినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి ఉప ముఖ్యమంత్రికి వివరించారు. విశ్వవిద్యాలయం నైపుణ్యాన్ని వినియోగించుకుంటూ, సంబంధిత శాఖలు, నిపుణుల సూచనలతో సమగ్ర ముసాయిదాను రూపొందించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం, వివక్షను నిరోధించడం, విద్యాసంస్థల్లో న్యాయబద్ధమైన వాతావరణాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రతిపాదిత చట్టంలో ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశం అభిప్రాయపడింది. చట్టంలోని నిబంధనలు ఆచరణ సాధ్యంగా ఉండటంతోపాటు, వాటి అమలుకు అవసరమైన వ్యవస్థలపై కూడా స్పష్టత ఉండాలని పేర్కొన్నారు.

మూడు నెలల్లోగా ప్రాథమిక ముసాయిదాను సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీకి సమర్పించి, తదుపరి పరిశీలనకు వీలుగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్ణీత గడువులో కసరత్తు పూర్తయ్యేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఉపయోగపడే సమగ్ర చట్టం రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రెటరి సవ్యసాచి ఘోష్, సీనియర్ ఐపీఎస్ అధికారి దేవేంద్ర సింగ్ చౌహాన్, ఐఏఎస్ అధికారులు యోగితా రాణా, విజయేంద్ర బోయి, , న్యాయవాది దిశా వడేకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి