హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, యూరియా సరఫరా, బొగ్గు కేటాయింపులు, విద్యాసంస్థల అభివృద్ధి, విమానాశ్రయం ఏర్పాటు, రైల్వే ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి పలు విజ్ఞప్తులతో కూడిన వినతిపత్రాలను ఆయనకు అందజేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని మంత్రి తుమ్మల కోరారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి కోరిన విధంగా మహానది బొగ్గును కేటాయించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అవసరమైన బొగ్గు సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర మంత్రిని కోరారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉండేలా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అభివృద్ధి కోసం కోల్ ఇండియా సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.100 కోట్లు మంజూరు చేయాలని తుమ్మల కోరారు. అలాగే, సింగరేణి సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సత్తుపల్లి బ్లాక్-III బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ విమానాశ్రయం ఏర్పాటు ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొంటూ, అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని తుమ్మల కోరారు. ముఖ్యంగా సత్తుపల్లి–కొవ్వూరు, పెనుబల్లి–కొండపల్లి రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పాండురంగాపురం–మల్కన్‌గిరి రైల్వే లైన్‌ను సారపాక వరకు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కీలకమైన ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖల ద్వారా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమర్పించిన వినతిపత్రాల్లో విజ్ఞప్తి చేశారు.





