Friday16 October 2026హైదరాబాద్

SENSEX74,629+3.76%
NIFTY23,132+3.44%
HYD 22K₹1,37,066/10g+0.33%
भाषाएँ

Latest News

ఎల్‌నినో ముప్పును సమష్టిగా ఎదుర్కొందాం.. నీటిని పొదుపుగా వాడుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి రైతులు యాసంగి పంటల సాగును తగ్గించుకోవాలి.. తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి

nagendra16 October 2026, 5:00 AM0 व्यूtrinetnews.com
ఎల్‌నినో ముప్పును సమష్టిగా ఎదుర్కొందాం.. నీటిని పొదుపుగా వాడుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి రైతులు యాసంగి పంటల సాగును తగ్గించుకోవాలి.. తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి

Share this story

Share link keeps your language (?lang=)

విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు చేరింది.. కేంద్రం సహకరించాలి**

అఖిలపక్ష సమావేశం నిర్వహించి, కేంద్ర మంత్రులను కలుస్తాం**

ప్రజలు, రైతులు, రాజకీయ పార్టీలు, మీడియా సహకారం అవసరం**

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 8 నుంచి 10 నెలల్లో ఎదురయ్యే సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తీవ్ర ఎండలు, తాగునీటి కొరత, విద్యుత్ డిమాండ్ పెరుగుదల, వ్యవసాయ రంగంపై ప్రభావం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. అందుబాటులో ఉన్న మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండటంతో పాటు నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని కోరారు.

నీటి కొరతపై ఆందోళన

రాష్ట్రంలో నీటి లభ్యతపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌లో నీటి నిల్వలు 72 శాతం, గోదావరి బేసిన్‌లో 40 శాతం మేర తక్కువగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో 23 శాతం వర్షపాతం లోటు నమోదైందని, 460 టీఎంసీల నీరు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతం కేవలం 209 టీఎంసీలే ఉన్నాయని పేర్కొన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలోని సుమారు 24 వేల గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నీటిని కొనుగోలు చేయగలిగినా, నీటినే కొనలేని పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ.. ప్రతి చుక్కను ఆదా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బండ్లు, కార్లు కడగడానికి తాగునీటిని వృథా చేయవద్దని సూచించారు.

యాసంగి సాగును తగ్గించుకోవాలి

తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎం కోరారు. రాష్ట్రంలో 56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 13 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసినట్లు తెలిపారు. రానున్న సీజన్‌లో వరి సాగును వాయిదా వేసుకోవాలని, యాసంగిలో పంటలు వేయడాన్ని తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మి వరి నాట్లు వేస్తే నారుమడి దశలోనే పంట ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నీటి కొరత కారణంగా రైతులు పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం చేతికొచ్చే దశలో ఉన్న వానాకాలం పంటలను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. సుమారు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయే ప్రమాదం ఉందని నివేదికలు అందినట్లు పేర్కొన్నారు.

విద్యుత్ డిమాండ్‌లో భారీ పెరుగుదల

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. సాధారణంగా అక్టోబర్‌లో 15 వేల మెగావాట్ల స్థాయిలో ఉండాల్సిన డిమాండ్ ప్రస్తుతం 20 వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఒక రోజులో 20,003 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైనట్లు వివరించారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల పంప్‌సెట్లు పనిచేస్తుండటంతో విద్యుత్ అవసరాలు మరింత పెరిగాయని చెప్పారు.

గత 13 ఏళ్లలో 14 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ డిమాండ్ పెరిగిందని, ప్రస్తుత ప్రభుత్వ రెండేళ్ల కాలంలోనే మరో 6 నుంచి 7 వేల మెగావాట్ల మేర డిమాండ్ పెరిగినట్లు తెలిపారు. అధిక డిమాండ్‌ను తట్టుకుంటూ రైతులకు, గృహ అవసరాలకు విద్యుత్ సరఫరా చేస్తున్న విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పాటు అధికారులను అభినందించారు. వానాకాలం పంటలు మరో 20 రోజుల్లో కోతకు వచ్చే అవకాశం ఉన్నందున పంటలు ఎండిపోకుండా మార్కెట్‌లో ఎంత ధరకు విద్యుత్ లభించినా కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయని, విద్యుత్ ఉత్పత్తి చేయగలిగిన రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను సేకరించి అవసరమైన రాష్ట్రాలకు తక్కువ ధరకు అందించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతులకు కేంద్రం అండగా నిలవాలి

వానాకాలంలో పంట నష్టపోయిన రైతులతో పాటు నీటి కొరత కారణంగా తదుపరి సీజన్‌లో సాగు చేయలేని రైతులను కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు సమకూర్చే పథకాల ద్వారా రైతులకు సహాయం అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కేంద్రం నుంచి ఉదారంగా ఆర్థిక సాయం పొందేందుకు అవసరమైన నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. దేశంలో ఎప్పుడు సంక్షోభం వచ్చినా రైతాంగం ముందుండి నిలబడిందని, రైతులు దేశానికి వెన్నెముకగా నిలిచారని పేర్కొన్నారు. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లోనూ రైతులు ప్రభుత్వానికి సహకరించాలని, నీటి లభ్యతను బట్టి సాగు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

ఉపాధి హామీ పనులతో చెరువుల పునరుద్ధరణ

నీటి కొరతతో పాటు ఉపాధి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని సీఎం తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో ఉపాధి హామీ పనుల్లో 25 వేల మంది పాల్గొనగా, ప్రస్తుతం రెండున్నర లక్షల మంది పనులు చేస్తున్నారని వివరించారు. ఉపాధి హామీ పథకం కింద చెరువులు, కుంటల మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నీటి వనరులను పునరుద్ధరించడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను కొంతవరకు అధిగమించవచ్చని పేర్కొన్నారు.

పశువులు, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి

ఎండలు, వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రజలు, పశువులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. పశువులకు తాగునీరు, పశుగ్రాసం అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. పేదలకు ఏ కష్టం వచ్చినా తక్షణమే ఆదుకునేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.

అఖిలపక్ష సమావేశం.. ఢిల్లీకి ప్రతినిధి బృందం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా రాష్ట్రం సహకరించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుత సంక్షోభంలోనూ అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. దసరా తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరిస్తామని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి అవసరమైన సహాయంపై చర్చిస్తామని వెల్లడించారు.

ప్రజల్లో అవగాహనకు ప్రత్యేక కార్యక్రమాలు

ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కళాజాతాలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. సీనియర్ జర్నలిస్టులు, నిపుణులు పత్రికల్లో వ్యాసాలు రాయాలని కోరారు. సినీ నటుడు విజయ్ దేవరకొండ ఇప్పటికే ఎల్‌నినోపై ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇతర సినీ నటులు, క్రీడాకారులు, కళాకారుల సహకారంతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు.

మీడియా సహకారం ఈ సమయంలో అత్యంత అవసరమని పేర్కొంటూ, మీడియా కోసం ప్రభుత్వ తరఫున నోడల్ అధికారిని నియమించి టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా ప్రభుత్వ సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ప్రజలు, రైతులు, అన్ని రాజకీయ పార్టీలు, మీడియా, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తే ఈ సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు.

यह भी पढ़ें