Friday16 October 2026హైదరాబాద్

SENSEX74,649+3.79%
NIFTY23,132+3.44%
HYD 22K₹1,37,066/10g+0.33%
भाषाएँ

Latest News

బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, సంప్రదాయాలకు ప్రతీక: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా లోక్ భవన్ లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు

nagendra16 October 2026, 4:57 AM0 व्यूtrinetnews.com
బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, సంప్రదాయాలకు ప్రతీక: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా లోక్ భవన్ లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు

Share this story

Share link keeps your language (?lang=)

– బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ దంపతులు

– గౌరమ్మకు గవర్నర్ దంపతుల ప్రత్యేక పూజలు.. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ప్రార్థన

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 15,

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు , స్త్రీశక్తికి, సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల్లో ప్రకృతి పట్ల ఆరాధనాభావాన్ని, సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని గవర్నర్‌ శ్రీ శివప్రతాప్‌ శుక్లా అన్నారు. పుష్పాలనే దైవ స్వరూపంగా భావించి పూజించే ప్రకృతి ఉత్సవం బతుకమ్మ పండుగ అని గవర్నర్ పేర్కొన్నారు .

గురువారం లోక్‌భవన్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన తన సతీమణి జానకి శుక్లాతో కలిసి పాల్గొని, గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, పూలతో అలంకరించిన బతుకమ్మ ప్రకృతి సౌందర్యానికి, జీవన వైభవానికి, మానవాళికి ప్రకృతితో ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతిబింబమని అన్నారు. ప్రకృతిని పరిరక్షించడం, సహజ వనరులను గౌరవించడం, పర్యావరణం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి విలువలను ఈ పండుగ చాటిచెబుతుందని తెలిపారు.

బతుకమ్మ మహిళల సృజనాత్మకతకు, ఆత్మగౌరవానికి, సామాజిక భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. జానపద గీతాలు, కళలు, సంప్రదాయ ఆచారాల ద్వారా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని సజీవంగా నిలుపుతున్న మహిళల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించి, భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.

ప్రకృతి పరిరక్షణ, మహిళా సాధికారత, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, సామాజిక సామరస్యానికి ప్రాధాన్యమిస్తూ తెలంగాణ పురోగతి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. బతుకమ్మ పండుగ ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

లోక్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో సుమారు 400 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు . తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు , లోక్‌భవన్‌ మహిళా ఉద్యోగులు , వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. గౌరీదేవి ప్రతిరూపాల చుట్టూ మహిళలంతా చేరి, చప్పట్లు కొడుతూ, లయబద్ధంగా ఉయ్యాల పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. కోలాటాల కోలాహలంతో అమ్మవారికి నీరాజనాలు పట్టారు. కుటుంబ క్షేమాన్ని కాంక్షిస్తూ, తమ సౌభాగ్యాన్ని నిండు నూరేళ్లు కాపాడమంటూ ఆ తల్లిని మనసారా వేడుకున్నారు. అనంతరం బతుకమ్మలను గవర్నర్ సతీమణి శ్రీమతి జానకి శుక్లా, మహిళా ఉద్యోగినులు లోక్ భవన్ లోని కొలనులో నిమజ్జనం చేశారు. కోలాట బృందాల సందడి, బతుకమ్మ పాటల మధురిమతో లోక్ భవన్ ప్రాంగణం పండుగ కళను సంతరించుకోనుంది.

రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో... లోక్ భవన్*

బతుకమ్మ పండుగ వేళ లోక్ భవన్ రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలతో జిగేల్‌మంటూ వెలిగిపోయింది. పూల పండుగైన బతుకమ్మకు ఈ విద్యుత్ కాంతులు అదనపు శోభను ఇచ్చాయి.

వేడుకల్లో గవర్నర్ సంయుక్త కార్యదర్శి శశికిరణ్ కోమండూర్ , ఉప కార్యదర్శి పల్లవి , ప్రెస్ సెక్రెటరీ మామిండ్ల

దశరథం ,అధికారులు , ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు .

यह भी पढ़ें