వరంగల్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15:
వరంగల్ జిల్లాలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ఉన్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమల పురోగతికి అవసరమైన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, ఐఏఎస్ అధికారులకు సూచించారు.
గురువారం ఆయన వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను సందర్శించారు. పార్క్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిటెక్స్ యంగ్వన్, గణేశా కంపెనీలను స్వయంగా తనిఖీ చేశారు. ఆయా పరిశ్రమల్లోని ఉత్పత్తి కార్యకలాపాలు, పనితీరును పరిశీలించి, సంబంధిత అంశాలపై అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో ముచ్చటించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వరంగల్ ప్రాంతంలో వస్త్ర పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం కల్పించాలని, స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలను పెంపొందించాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను క్షుణ్ణంగా పరిశీలించి, తగిన ప్రతిపాదనలతో ముందుకు రావాలని అధికారులను ఆదేశించారు. వస్త్ర పరిశ్రమ రంగం అభివృద్ధి చెందడం ద్వారా స్థానికంగా పరిశ్రమల విస్తరణకు, ఈ ప్రాంత ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి, పరిశ్రమలకు అవసరమైన సహకారాన్ని సకాలంలో అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్, చేనేత మరియు వస్త్ర శాఖ అదనపు సంచాలకులు ఎన్. వెంకటేశ్వరరావు, ఏడీ శ్రీకాంత్ రెడ్డి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి, నారాయణ రెడ్డి, టీటీడీఓ, సంగెం తహసీల్దార్ జి. రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





