Friday16 October 2026Hyderabad

SENSEX74,652+3.79%
NIFTY23,115+3.36%
HYD 22K₹1,36,997/10g+0.21%
Languages

Latest News

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేస్తాం ఏళ్ల తరబడి తిష్టవేసిన అధికారులను బదిలీ చేస్తాం

nagendra16 October 2026, 4:55 AM0 viewstrinetnews.com
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేస్తాం ఏళ్ల తరబడి తిష్టవేసిన అధికారులను బదిలీ చేస్తాం

Share this story

Share link keeps your language (?lang=)

2018 నుంచి క్లెయిమ్‌లపై సమగ్ర విజిలెన్స్ విచారణ

అక్రమాలకు పాల్పడిన వారెవరైనా ఉపేక్షించం

నా సిఫారసు లేఖతో క్లెయిమ్ మంజూరైనట్లు వచ్చిన వార్తలు అవాస్తవం

శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15:

కార్మికుల సంక్షేమ నిధులను పరిరక్షించడంతో పాటు పరిపాలనలో పారదర్శకతే లక్ష్యంగా కార్మిక శాఖలో సమూల ప్రక్షాళన చేపట్టనున్నట్లు శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియను ప్రక్షాళన చేయడంతో పాటు, ఏళ్ల తరబడి ఒకే చోట తిష్టవేసిన అధికారులను త్వరలోనే బదిలీ చేస్తామని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి రూపాయి సక్రమంగా వినియోగమయ్యేలా పటిష్ఠమైన వ్యవస్థను రూపొందిస్తామన్నారు.

సచివాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కార్మిక శాఖలో క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ప్రాథమిక ఆధారాల మేరకు ఇద్దరు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశామని, వ్యవహారంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశించామని వెల్లడించారు. విచారణలో ఎవరిపాత్ర బయటపడినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్మికుల పరిహార క్లెయిమ్‌ల పరిష్కారంలో పారదర్శకత లోపించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి తెలిపారు. బోగస్ పత్రాలు, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అక్రమంగా క్లెయిమ్‌లు పొందినట్లు ఆరోపణలు రావడంతో 2018 నుంచి ఇప్పటివరకు నమోదైన అన్ని రకాల క్లెయిమ్‌లను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించినట్లు చెప్పారు. జాయింట్ లేబర్ కమిషనర్ స్థాయిలో ప్రాథమిక విచారణ జరిపి ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నామని వివరించారు. దాని ఆధారంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విజిలెన్స్ నివేదిక నెల, రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని, నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తప్పు చేసిన అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. క్లెయిమ్‌ల పరిశీలన, పరిహారం మంజూరు, చెల్లింపుల బాధ్యత సంబంధిత కార్మిక శాఖ అధికారులదేనని మంత్రి తెలిపారు. బోర్డులోని విధానాలను సమీక్షించి, అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రక్రియలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. వివిధ సంస్థలు, నిర్మాణదారుల నుంచి వసూలు కావాల్సిన వందల కోట్ల రూపాయల లేబర్ సెస్సును నిబంధనల ప్రకారం పెనాల్టీలతో సహా వసూలు చేస్తామని వెల్లడించారు. తన సిఫారసు లేఖ ఆధారంగా కార్మికుల పరిహార క్లెయిమ్ మంజూరైనట్లు ఒక పత్రికలో వచ్చిన కథనాలు అవాస్తవమని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులను ఆశ్రయించడం సహజమని, సంబంధిత అధికారులకు నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించడం సాధారణ విధానమని చెప్పారు. తన వద్దకు వచ్చిన దరఖాస్తుపై నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మాత్రమే సూచించానని వివరించారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆ దరఖాస్తును తిరస్కరించారని, దరఖాస్తుదారుడికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం చెల్లించలేదని తెలిపారు. చెల్లింపే జరగనప్పుడు తన సిఫారసుతో క్లెయిమ్ మంజూరైనట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలు ప్రచురించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. సింగరేణి సంస్థ పరిస్థితిపై బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య లక్ష నుంచి 38 వేలకు పడిపోయిందని, దాదాపు 62 వేల ఉద్యోగాలు తగ్గిపోయాయని అన్నారు. ఆ పదేళ్లలో ఒక్క కొత్త బొగ్గు గని కూడా సంస్థకు రాలేదని పేర్కొన్నారు. బొగ్గు గనుల వేలం చట్టానికి పార్లమెంట్‌లో అనుకూలంగా ఓటేసింది బీఆర్‌ఎస్ ఎంపీలేనని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు గనులు కేటాయించే అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వేలంలో పాల్గొని ఆర్కేఓసీ మైన్, తాడిచర్లలో మరో గనిని సింగరేణికి దక్కేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

కొత్త గనుల ఏర్పాటు ద్వారా బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. సంస్థ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టడం అత్యవసరమని, సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ విస్తరణకు అవసరమైన నిధులను క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద కేటాయించడం సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమేనని వివరించారు.

సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరుకు దక్కాల్సిన డీఎంఎఫ్‌టీ నిధులను గత బీఆర్‌ఎస్ పాలనలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలకు మళ్లించారని మంత్రి అన్నారు. బొగ్గు గనుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, స్థానిక ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం సమంజసం కాదన్నారు.

సింగరేణి సంస్థపై గత ప్రభుత్వం బకాయిల భారాన్ని మోపిందని, కాంట్రాక్టర్ల బిల్లులు, ఉద్యోగుల బకాయిలు పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. సంస్థ ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేస్తూ, భవిష్యత్తులో పోటీని తట్టుకునేలా పెట్టుబడులు పెట్టడం ప్రస్తుత ప్రభుత్వ విధానమని తెలిపారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి అన్నారు. రాష్ట్రంపై సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని, గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలు, అప్పులపై వడ్డీల చెల్లింపులు ప్రస్తుత ప్రభుత్వానికి భారంగా మారాయని అన్నారు.

ప్రజాధనాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల వ్యయం, నిధుల వినియోగంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్ నేతలపై ఉందన్నారు.

Also read