Friday16 October 2026హైదరాబాద్

SENSEX74,629+3.76%
NIFTY23,132+3.44%
HYD 22K₹1,37,066/10g+0.33%
भाषाएँ

Latest News

చిన్న సినిమాలను చంపేస్తున్నారు.. ఇండస్ట్రీ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఫైర్‌! థియేటర్లు ఇవ్వరు.. ఓటీటీకి అమ్ముకోనివ్వరు..

nagendra16 October 2026, 4:52 AM0 व्यूtrinetnews.com
చిన్న సినిమాలను చంపేస్తున్నారు.. ఇండస్ట్రీ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఫైర్‌! థియేటర్లు ఇవ్వరు.. ఓటీటీకి అమ్ముకోనివ్వరు..

Share this story

Share link keeps your language (?lang=)

శాటిలైట్ హక్కులకూ దారుల్లేవు

సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలి.. చిన్న నిర్మాతలను ఆదుకోవాలి

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15: సినిమా తీయడం ఒక ఎత్తయితే.. దాన్ని థియేటర్లలో విడుదల చేయడం మరో ఎత్తు! చిన్న సినిమా నిర్మాతలకు అసలు పరీక్ష సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాతే మొదలవుతోందా? పెట్టుబడులు పెట్టి, అప్పులు చేసి సినిమాలు తీస్తున్న నిర్మాతలకు థియేటర్లు దొరకకపోవడం.. ఓటీటీ, శాటిలైట్ హక్కులు విక్రయించుకునే అవకాశాలు లేకపోవడం వెనుక ఎవరున్నారు? చిన్న సినిమాల విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వివక్ష కొనసాగుతోందా? ‘ఓ అందాల రాక్షసీ’ హీరో, నిర్మాత షిరాజ్ మెహదీ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా, వాటి వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తున్నారంటూ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు, సంస్థల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిన్న సినిమాల నిర్మాతల కష్టాలను పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా తీయడమే నేరమా?*

సినిమా నిర్మాణం కోసం నిర్మాతలు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, ఎన్నో ఆశలతో సినిమా పూర్తి చేసిన తర్వాత విడుదల, వ్యాపారం విషయంలో మాత్రం ఇబ్బందులు

ఎదుర్కొంటున్నారని షిరాజ్ మెహదీ పేర్కొన్నారు. సినిమా తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతకు, సినిమా పూర్తయిన తర్వాత అండగా నిలిచేవారు లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలిం చాంబ‌ర్ వాళ్లు ‘మీరు సినిమా ఎందుకు తీశారు?’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇత‌రులు తీసే సినిమాల‌తో తమకు సంబంధం లేదన్న ధోరణిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆరోపించారు. సినిమా నిర్మాణానికి ప్రోత్సాహం ఇవ్వకపోగా, విడుదల సమయంలోనూ అడ్డంకులు ఎదురైతే చిన్న నిర్మాతలు ఎవరిని ఆశ్రయించాలని ప్రశ్నించారు. తెలుగు ఫిలిం చాంబ‌ర్ స్థానంలో తెలంగాణ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందేని డిమాండ్ చేశారు.

థియేటర్లు లేవు.. ఓటీటీ కొనదు.. నిర్మాత బతికేదెలా?*

చిన్న సినిమాలకు థియేటర్లు కేటాయించకపోవడం, ఓటీటీ సంస్థలు, శాటిలైట్ ఛానెళ్ల ద్వారా హక్కులు విక్రయించుకునే అవకాశాలు పరిమితం కావడం నిర్మాతలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందని షిరాజ్ మెహదీ ఆరోపించారు.

సినిమా కోసం డబ్బు పెట్టిన నిర్మాతకు పెట్టుబడి తిరిగి వచ్చే మార్గాలే మూసుకుపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. పెద్ద సినిమాలకు లభించే అవకాశాలు చిన్న సినిమాలకు ఎందుకు లభించడం లేదని నిలదీశారు. చిన్న చిత్రాల సమస్యలను పరిష్కరించకుండా వదిలేస్తే, కొత్త నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తోంది?*

చిన్న సినిమాల వ్యాపార సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ బాధ్యత తీసుకోవడం లేదని షిరాజ్ మెహదీ విమర్శించారు. నటీనటులు, దర్శకులు, నిర్మాతల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు పరిష్కారానికి ముందుకొచ్చే సంస్థలు, సినిమాల వ్యాపారం, విడుదల, హక్కుల విక్రయం వంటి అంశాల దగ్గరకు వచ్చేసరికి తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు విదేశీ మార్కెట్లలోనూ సినిమాల హక్కుల విక్రయాలకు పారదర్శకమైన విధానం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి సినిమాకు వ్యాపార అవకాశాలు కల్పించే వ్యవస్థను తీసుకురావాలని డిమాండ్ చేశారు.

రైతు ప్రాణమే ప్రాణమా.. సినీ కార్మికుల ప్రాణాలు కావా?

చిన్న సినిమాల వెనుక ఎంతోమంది జీవితాలు, కుటుంబాల భవిష్యత్తు ముడిపడి ఉంటాయని షిరాజ్ మెహదీ భావోద్వేగంగా పేర్కొన్నారు. ఒక రైతు నష్టపోయినా, ప్రాణాలు కోల్పోయినా సమాజం స్పందిస్తుందని.. మరి సినిమా కోసం అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి నష్టపోయే నిర్మాతలు, దర్శకులు, నటీనటుల పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. సినిమా రంగంలోనూ చిన్న నిర్మాతల సమస్యలను మానవీయ కోణంలో చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులను తేలికగా తీసుకోకూడదని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చిన్న సినిమాలను ఆదుకోవాలని షిరాజ్ మెహదీ విజ్ఞప్తి చేశారు. చిన్న బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీలు అందించడం, థియేటర్ల కేటాయింపుల్లో పారదర్శకత తీసుకురావడం, ఓటీటీ, శాటిలైట్ హక్కుల విక్రయాలకు అవకాశాలు పెంచడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే చిన్న సినిమాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్న సమయంలో పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ, తెలంగాణ ప్రభుత్వం కూడా చిన్న నిర్మాతల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

లీగల్ నోటీసులు పంపినా స్పందన లేదు

ఐనాక్స్‌, పీవీఆర్‌, ఏషియన్ ఫిలిమ్స్‌, నిర్మాత సురేష్ బాబు, ఎఫ్‌డీసీ చైర్మ‌న్ దిల్‌రాజు తదితరులకు లీగల్ నోటీసులు, గ్రీవెన్స్ పిటిషన్లు పంపినప్పటికీ స్పందన రాలేదని షిరాజ్ మెహదీ వెల్లడించారు. తన సమస్యతో పాటు చిన్న సినిమాల నిర్మాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సంబంధిత సంస్థలు స్పందించాలని కోరారు.

यह भी पढ़ें