Friday16 October 2026Hyderabad

SENSEX74,691+3.85%
NIFTY23,113+3.35%
HYD 22K₹1,37,225/10g+0.42%
Languages

Latest News

తాడిచెర్ల గనులు కూడా తమ కృషేనని మంత్రి వివేక్ వెంకట్ స్వామి

nagendra16 October 2026, 4:48 AM0 viewstrinetnews.com
తాడిచెర్ల గనులు కూడా తమ కృషేనని మంత్రి వివేక్ వెంకట్ స్వామి

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15: సింగరేణి అంశంపై సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. లక్ష మంది ఉద్యోగులు ఉండే సింగరేణిలో ఆ సంఖ్యను 30 వేలకు తెచ్చింది గత ప్రభుత్వమేనని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా ఒక్క గని కూడా రాలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నచ్చ చెప్పి.. వేలంలో పాల్గొని గనులు దక్కించుకున్నామని వివరించారు. తాడిచెర్ల గనులు కూడా తమ కృషేనని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే సింగరేణి సంస్థ ఆదాయం పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావే ఒప్పుకున్నరని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేయాలో కేటీఆర్‌కు తెలుసునన్నారు. ఉద్యమంలో కేటీఆర్ ఆస్తులు పెరిగాయని తెలిపారు. ఆయనకు వందల ఎకరాలు ఎలా వచ్చాయో విచారణ జరగాలని అన్నారు. కేసీఆర్ రైతులను కోటీశ్వరుడిని చేస్తానని చెప్పి.. కేవలం ఆయన మాత్రమే అయ్యారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఆయన ఎలా కోటీశ్వరుడు అయ్యాడో అందరికీ చెప్పాలి కదా అని స్పష్టం చేశారు. ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ హైదరాబాద్‌ పర్యటనకు రావడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆయన పర్యటనకు సింగరేణి నిధులు వినియోగించారనడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ డిజార్డర్‌గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డి కట్టడానికే తమకు సరిపోతుందని చెప్పారు. లేబర్ బోర్డుపై వస్తున్న ఆరోపణలపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. అందుకు విజిలెన్స్ విచారణ‌కు ఆదేశించామని తెలిపారు. దీనిపై నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రెండు నెలల్లో విచారణ పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. నకిలీ సర్టిఫికెట్స్ విషయంలో కొందరిపై చర్యలు తీసుకున్నామని వివరించారు. 2018 నుంచి జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందని మంత్రి వివేక్ వెంకట స్వామి తెలిపారు

Also read