Friday16 October 2026Hyderabad

SENSEX74,691+3.85%
NIFTY23,113+3.35%
HYD 22K₹1,37,225/10g+0.42%
Languages

Latest News

స్థానిక భాషల్లో డిజిటల్ సేవలకు ‘భాషిణి’ తోడ్పాటు

nagendra16 October 2026, 4:33 AM0 viewstrinetnews.com
స్థానిక భాషల్లో డిజిటల్ సేవలకు ‘భాషిణి’ తోడ్పాటు

Share this story

Share link keeps your language (?lang=)

మణిపూర్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం బహుభాషా కృత్రిమ మేధ, భాషా సాంకేతికత అభివృద్ధిపై దృష్టి

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15:

స్థానిక భాషల్లో ప్రభుత్వ డిజిటల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిణి విభాగం (డీఐబీడీ), మణిపూర్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అక్టోబర్ 14న ఇంఫాల్‌లో నిర్వహించిన ‘భాషిణి రాజ్యం–మణిపూర్ చాప్టర్’ కార్యశాలలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. బహుభాషా కృత్రిమ మేధ అభివృద్ధి, స్థానిక భాషా వనరుల బలోపేతం, ప్రభుత్వ సేవల్లో భాషా సాంకేతికత వినియోగంపై కార్యశాలలో చర్చించారు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌కు చెందిన భాషిణి విభాగం, మణిపూర్ ఐటీ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ హాజరయ్యారు. భాషిణి సీఈఓ అమితాబ్ నాగ్, మణిపూర్ ఐటీ శాఖ కార్యదర్శి సోమోర్జిత్ సలామ్ ఆయా సంస్థల తరఫున ఒప్పందంపై సంతకాలు చేశారు.

భారతదేశ భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించడంలో కృత్రిమ మేధ, భాషా సాంకేతికత కీలక పాత్ర పోషించగలవని ముఖ్యమంత్రి ఖేమ్‌చంద్ సింగ్ పేర్కొన్నారు. మణిపూర్‌లోని మరిన్ని భాషలను డిజిటల్ వేదికలపైకి తీసుకురావడం ద్వారా ఆయా సమాజాలకు కొత్త అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. భాషా వైవిధ్యం దేశానికి విలువైన బలమని అభిప్రాయపడ్డారు.

ఆంగ్లం నుంచి మణిపురికి తక్షణ అనువాదం

కార్యశాలలో ఆంగ్లం నుంచి మణిపురి భాషలోకి తక్షణ అనువాదాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. ప్రభుత్వ వేదికలు, ప్రజాసేవల అప్లికేషన్లలో బహుభాషా సేవలను అనుసంధానించే అవకాశాలను వివరించారు. విద్య, వైద్యం, న్యాయ సేవలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఈ సాంకేతికత వినియోగంపై చర్చించారు.

ప్రజలు అర్థం చేసుకొని, నమ్మకంగా వినియోగించగలిగినప్పుడే డిజిటల్ సేవలు సమర్థంగా పనిచేస్తాయని సోమోర్జిత్ సలామ్ అన్నారు. మణిపూర్ అవసరాలకు అనుగుణంగా పరీక్షించిన భాషా పరిష్కారాలతో సేవల వినియోగంలో అడ్డంకులను తగ్గించవచ్చని తెలిపారు. భారతదేశ భాషా వైవిధ్యాన్ని కృత్రిమ మేధ అర్థం చేసుకోవాలని, డిజిటల్ సేవలు పొందేందుకు భాష అవరోధంగా మారకూడదని అమితాబ్ నాగ్ పేర్కొన్నారు.

భాషా నిపుణులు, స్థానిక సమాజాల భాగస్వామ్యం

మణిపురి, తాంగ్‌ఖుల్, థడౌ, పైతే, హ్మార్, లియాంగ్‌మై తదితర భాషలకు సంబంధించిన డిజిటల్ వనరులను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని కార్యశాల ప్రస్తావించింది. స్థానిక భాషా నిపుణులు, ఆయా సమాజాల సహకారంతో సమాచారాన్ని సేకరించడం, భాషా నమూనాల పనితీరును ధ్రువీకరించడం ద్వారా ప్రజలకు ఉపయోగపడే పరిష్కారాలను రూపొందించాలని సూచించారు.

డెవలపర్లు, విద్యార్థులు, ఆవిష్కర్తల కోసం నిర్వహించిన ‘భాషిణి శిల్పి’ కార్యక్రమంలో భాషా ఆధారిత కృత్రిమ మేధతో అప్లికేషన్ల రూపకల్పన అవకాశాలను పరిచయం చేశారు. ‘భాషిణి మిత్ర’ ద్వారా విద్యా సంస్థలు, భాషా సమాజాలు స్థానిక భాషా సమాచారాన్ని అందించి బహుభాషా వనరుల అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చని వివరించారు.

ఒప్పందంలో భాగంగా ప్రాధాన్య సేవలను గుర్తించడం, వాటికి అవసరమైన భాషా సమాచారాన్ని అంచనా వేయడం, సంబంధిత ప్రభుత్వ వేదికల్లో భాషిణి సాంకేతికతను అనుసంధానించే అవకాశాలను పరిశీలించనున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అభివృద్ధి చేసి పరీక్షించడంపై రెండు పక్షాలు దృష్టి సారించనున్నాయి.

ప్రస్తుతం భాషిణి 800కు పైగా ప్రభుత్వ వెబ్‌సైట్లకు బహుభాషా సేవలను అందిస్తోంది. పాఠ్య సేవలకు 36 భారతీయ భాషలు, వాయిస్ సేవలకు 23 భారతీయ భాషలతోపాటు 35 అంతర్జాతీయ భాషలకు మద్దతు ఇస్తున్నట్లు డీఐబీడీ తెలిపింది.

Also read