బొగ్గు ఉత్పత్తి నుంచి రవాణా వరకు పటిష్ట నిఘా వ్యవస్థ.. ఆధారాలుంటే బయటపెట్టండి
సైట్ విజిట్ నిబంధన సంస్థ ప్రయోజనాల కోసమే.. దుష్ప్రచారంతో అభివృద్ధిని అడ్డుకోలేరు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15:
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, టెండర్ల ప్రక్రియ, సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నాయకులు చేస్తున్న ఆరోపణలకు రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ఘాటుగా స్పందించారు. సింగరేణి సంస్థ ప్రయోజనాలను కాపాడటం, కొత్త బొగ్గు గనులను సాధించడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ సింగరేణి కార్మికులు, అధికారుల నిజాయితీపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు.
జీ-9 బొగ్గు సరఫరాపై వాస్తవాలివీ..
సింగరేణిలో ప్రస్తుతం తొమ్మిది గనుల నుంచి జీ-9 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి అవుతోందని మంత్రి తెలిపారు. గత పదేళ్లలో ఇంధన సరఫరా ఒప్పందాలు ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏటా సగటున సుమారు 4 మిలియన్ టన్నుల జీ-9 బొగ్గు సరఫరా జరిగిందని వివరించారు. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి 25 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు సరఫరా చేసిందని పేర్కొన్నారు. ఇందులో జీ-9 గ్రేడ్ బొగ్గు కేవలం 1.20 మిలియన్ టన్నులు మాత్రమేనని, అందులోనూ 0.52 మిలియన్ టన్నులు తెలంగాణ జెన్కో విద్యుత్ కేంద్రాలకే సరఫరా చేసినట్లు వెల్లడించారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఏటా 14 మిలియన్ టన్నుల జీ-9 బొగ్గు సరఫరా చేసేలా ఇంధన సరఫరా ఒప్పందం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. సింగరేణి భవిష్యత్తులో చేపట్టనున్న కొత్త గనుల నుంచి పెరిగే ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఆ ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. అయితే, ఆ కొత్త గనులు ఎందుకు అందుబాటులోకి రాలేదని గత పాలకులను ప్రశ్నించారు.
కొత్త గనులు రాకపోవడంతో ఉత్పత్తి సామర్థ్యానికి గండి
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనకపోవడంతో కీలకమైన కోయగూడెం-3, సత్తుపల్లి-3 బ్లాకులు సంస్థకు దక్కలేదని మంత్రి ఆరోపించారు. ఫలితంగా ఏటా దాదాపు 10 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశాన్ని సింగరేణి కోల్పోయిందని పేర్కొన్నారు. దాదాపు 14 గనులు మూతపడటం వల్ల మరో 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం పడిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త గనుల అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నైనీ బొగ్గు గనికి అవసరమైన అనుమతులు సాధించి ఉత్పత్తి ప్రారంభించిందని వెల్లడించారు. 2013లో యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన తాడిచెర్ల బ్లాక్-2కు మైనింగ్ అనుమతులు తీసుకొచ్చామని, వేలం ద్వారా మణుగూరు పీకే ఓసీ-2 డిప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణికి దక్కించామని తెలిపారు. ఈ గనుల ద్వారా రానున్న రోజుల్లో సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
### బొగ్గు మాయమయ్యే అవకాశమే లేదు
సింగరేణికి 137 ఏళ్ల సుదీర్ఘ మైనింగ్ అనుభవం ఉందని, బొగ్గు ఉత్పత్తి నుంచి లోడింగ్, రవాణా, తూకం, తుది పంపిణీ వరకు ప్రతి దశను పర్యవేక్షించే సాంకేతికత ఆధారిత బహుళ అంచెల వ్యవస్థ అమల్లో ఉందని శ్రీధర్‌బాబు వివరించారు. SAP/ERP అనుసంధానం, GPS/GPRS ద్వారా వాహనాల ట్రాకింగ్, జియో-ఫెన్సింగ్, ఎలక్ట్రానిక్ తూకం, ఆకస్మిక తనిఖీలు, బూమ్ బారియర్లు, బొగ్గు నిల్వల క్రమానుగత పరిశీలన, బొగ్గు చోరీ నిరోధక బృందాలు, నిరంతర విజిలెన్స్ చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి టన్ను బొగ్గుకు లెక్క ఉండేలా పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉందని, ఇలాంటి వ్యవస్థలో బొగ్గు మాయమవుతోందంటూ చేసే ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులు, అధికారుల నిజాయితీని ప్రశ్నించే ముందు వాస్తవాలను పరిశీలించాలని సూచించారు.
### సైట్ విజిట్ నిబంధనతో పారదర్శకత
సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనను సింగరేణి సంస్థ ప్రయోజనాల కోసమే ప్రవేశపెట్టామని మంత్రి స్పష్టం చేశారు. టెండర్లలో పాల్గొనే కాంట్రాక్టర్లు తాము చేపట్టబోయే పనుల స్థల పరిస్థితులు, భౌగోళిక స్వరూపం, స్థానిక సామాజిక అంశాలు, మౌలిక సదుపాయాలపై ముందుగానే పూర్తి అవగాహన పొందాలన్నదే ఈ నిబంధన ఉద్దేశమని వివరించారు.
గతంలో ఓవర్ బర్డెన్ తొలగింపు టెండర్లలో పాల్గొన్న కొందరు కాంట్రాక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించకుండానే టెండర్లు దాఖలు చేసేవారని తెలిపారు. టెండర్లు దక్కించుకున్న తర్వాత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పనులు చేయలేక మధ్యలోనే నిలిపివేయడం, పనులు వదిలేసి వెళ్లడం వంటి ఘటనలతో సింగరేణి నష్టపోయిందని పేర్కొన్నారు. ఈ సమస్యలను నివారించడంతో పాటు ఆరోగ్యకరమైన పోటీకి, పనులను సమర్థంగా పూర్తి చేయగలిగే కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించేందుకే ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ విధానం సింగరేణికే పరిమితం కాదని, జీఎండీసీ-గుజరాత్, జీఐపీసీఎల్, ఎన్ఎండీసీతో పాటు కొన్ని సోలార్ ప్రాజెక్టులు, ఈపీసీ కాంట్రాక్టుల్లోనూ అమల్లో ఉందని వివరించారు. సింగరేణిలో కూడా కోల్ ఇండియా అనుబంధ సంస్థ సీఎంపీడీఐ సలహా మేరకు 2018, 2021, 2023లో సీహెచ్పీల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లలో సైట్ విజిట్ నిబంధనను చేర్చినట్లు గుర్తుచేశారు.
ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఓవర్ బర్డెన్ తొలగింపు పనులను కొనసాగిస్తున్నారని తెలిపారు. గతంలో సరైనదిగా భావించిన నిబంధన ఇప్పుడు ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. అప్పట్లో అభ్యంతరం చెప్పని వారు ఇప్పుడు విమర్శలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు.
### సింగరేణిని బలోపేతం చేయడమే లక్ష్యం
సింగరేణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థ అని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. సంస్థను మరింత బలోపేతం చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
గత పాలకులు బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేయడం వల్ల సంస్థకు కొత్త గనులు దక్కలేదని, అదే సమయంలో ప్రైవేటీకరణపై ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త బొగ్గు గనులను సాధించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని బ్లాకులను సంస్థకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా కీలక ఖనిజాలు, థర్మల్ విద్యుత్, సౌర విద్యుత్ రంగాల్లోనూ సింగరేణి కార్యకలాపాలను విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
### సంపదను పెంచి ప్రజలకు పంచుతాం
గనులను కోల్పోయిన వారే సింగరేణి ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్నారని, కొత్త గనులను సాధిస్తూ సంస్థను కాపాడేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. సింగరేణి ఆస్తులు, వనరులను సంరక్షిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం, సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
సింగరేణి సంపదను పెంచడం.. ప్రజలకు పంచడం.. ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. దుష్ప్రచారంతో ఈ లక్ష్యాన్ని ఎవరూ అడ్డుకోలేరు”అని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.





