Friday16 October 2026హైదరాబాద్

SENSEX74,691+3.85%
NIFTY23,113+3.35%
HYD 22K₹1,37,225/10g+0.42%
भाषाएँ

Latest News

ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వం అప్రమత్తం తాగునీటికి తొలి ప్రాధాన్యత.. పంటల రక్షణకు ప్రత్యేక చర్యలు

nagendra16 October 2026, 4:26 AM0 व्यूtrinetnews.com
ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వం అప్రమత్తం తాగునీటికి తొలి ప్రాధాన్యత.. పంటల రక్షణకు ప్రత్యేక చర్యలు

Share this story

Share link keeps your language (?lang=)

సింగూర్ డ్యామ్‌ను సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

సంగారెడ్డి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15:

ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూగర్భ జలమట్టాల తగ్గుదల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే రోజుల్లో తాగునీటి అవసరాలు, పంటల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ డ్యామ్‌ను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని, ఫిబ్రవరి వరకు ఇది గరిష్ఠ స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభావంతో ఈసారి మాన్సూన్‌పై తీవ్ర ప్రభావం పడిందని, ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయని వివరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ అంశంపై సమీక్ష నిర్వహించారని తెలిపారు. సాయంత్రం జరిగే క్యాబినెట్ సమావేశంలోనూ పరిస్థితులపై విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.

తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత

రాబోయే రోజుల్లో తాగునీటి లభ్యత, పంటల పరిస్థితిని సమీక్షించేందుకే సింగూర్ డ్యామ్‌ను సందర్శించినట్లు సంజయ్ జాజు తెలిపారు. భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవడంతో విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ బోర్ల నుంచి నీరు లభించని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నీటి లభ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పంటల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలి

ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రాబోయే 15 నుంచి 20 రోజులు కీలకమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. పంటలకు అవసరమైన నీటి లభ్యత, విద్యుత్ సరఫరా తదితర అంశాలను పర్యవేక్షిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, పంటలను రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలకు నోడల్ అధికారులు

ప్రస్తుత పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాకు నోడల్ అధికారులను పంపిస్తున్నట్లు సంజయ్ జాజు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, రైతులకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. రాబోయే రోజుల్లో తలెత్తే నీటి ఎద్దడి, పంటల సమస్యలను ముందుగానే అంచనా వేసి తగిన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

వాతావరణ పరిస్థితుల మార్పుల నేపథ్యంలో తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపడుతోందని సంజయ్ జాజు పేర్కొన్నారు.

यह भी पढ़ें