Thursday15 October 2026Hyderabad

SENSEX73,759+1.78%
NIFTY22,945+1.88%
HYD 22K₹1,35,863/10g-0.55%
Languages

Latest News

పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలి: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి • వచ్చే 20 రోజులు అత్యంత కీలకం.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను సహించేది లేదు

nagendra15 October 2026, 2:42 AM0 viewstrinetnews.com
పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలి: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి • వచ్చే 20 రోజులు అత్యంత కీలకం.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను సహించేది లేదు

Share this story

Share link keeps your language (?lang=)

• విద్యుత్ అధికారులపై సీఎం తీవ్ర ఆగ్రహం.. నిర్లక్ష్యం చేస్తే ఐఏఎస్ లను సస్పెండ్ చేస్తామని హెచ్చరిక

• ఎల్‌నినో కోవిడ్ లాంటి విపత్తు.. అప్రమత్తం కాకపోతే సంక్షోభమే

• వచ్చే జూన్ వరకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలి

• తాగునీరు, పశుగ్రాసానికి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు

• ప్రతి మండలానికి గ్రూప్–1, గ్రూప్–2 అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 14: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదని హెచ్చరించారు. వ్యవసాయానికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా సరఫరా పెంచాలని సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని అధికారులను నిలదీశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు లింకేజీ ఏర్పాట్లు చేసినా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ఆరా తీశారు.

"ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది నేను. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారలేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు" అని ముఖ్యమంత్రి తీవ్రంగా హెచ్చరించారు. అవసరమైతే విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్, జెన్‌కో సీఎండీ.. సంబంధిత విభాగపు ఐఏఎస్ లను సస్పెండ్ చేస్తానని మండిపడ్డారు. విద్యుత్ అంతరాయాలకు రోజుకో కారణం చెప్పవద్దని హెచ్చరించారు.

ఎల్‌నినో కోవిడ్ లాంటి విపత్తు

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కోవిడ్ తరహా విపత్తుగా పరిగణించి అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పుడు సాధారణ సమస్యగా కనిపిస్తున్న పరిస్థితులు ముందస్తు చర్యలు చేపట్టకపోతే తీవ్ర సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎల్‌నినో కోవిడ్ లాంటి విపత్తు. ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు సమస్యగా కనిపిస్తోంది. అప్రమత్తం కాకపోతే సంక్షోభంగా మారుతుంది. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ఎల్‌నినో ప్రభావాన్ని లోతుగా అంచనా వేయాలి. సమస్యలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలి" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈ పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేమని, మళ్లీ వానలు వచ్చే వరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాల్సిందేనన్నారు. వచ్చే జూన్ వరకు ప్రతి శాఖ పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. రాబోయే సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

తాగునీరు, పశుగ్రాసానికి ఇబ్బందులు రాకుండా చర్యలు

వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణ రంగంతో పాటు ఇతర అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో పశువులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి మండలానికి ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు

ఎల్‌నినో ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి గ్రూప్–1, గ్రూప్–2 స్థాయి అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా మండలాల్లో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్, తాగునీటి సరఫరా, పంటలు, పశుగ్రాసం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించాలని సూచించారు.

సంబంధిత మండలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి నివేదించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

గ్రామసభలు, కళాజాతలతో ప్రజల్లో అవగాహన

ఎల్‌నినో ఒక విపత్తని, దీని ప్రభావం, రాబోయే సంక్షోభ పరిస్థితులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. దసరా తర్వాత దీపావళి వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కళాజాతల ద్వారా ప్రజలకు ఎల్‌నినో ప్రభావాన్ని వివరించాలని, నీరు, విద్యుత్ పొదుపుతో పాటు రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలకు ఈ విపత్తు తీవ్రతను వివరించాలని ఆదేశించారు. మళ్లీ వర్షాలు వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Also read