Thursday15 October 2026హైదరాబాద్

SENSEX73,814+1.85%
NIFTY22,932+1.83%
HYD 22K₹1,35,840/10g-0.57%
भाषाएँ

Latest News

విద్యుత్‌ రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై మేధోమథనం ఢిల్లీలో సీఈఏ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం ‘విద్యుత్‌ ద్వార్‌’ పోర్టల్‌, ట్రాన్స్‌మిషన్‌ ప్రణాళిక మార్గదర్శకాల ఆవిష్కరణ

nagendra15 October 2026, 2:38 AM0 व्यूtrinetnews.com
విద్యుత్‌ రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై మేధోమథనం ఢిల్లీలో సీఈఏ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం ‘విద్యుత్‌ ద్వార్‌’ పోర్టల్‌, ట్రాన్స్‌మిషన్‌ ప్రణాళిక మార్గదర్శకాల ఆవిష్కరణ

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్‌ న్యూస్‌, అక్టోబర్‌ 14: భారత విద్యుత్‌ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ (సీఈఏ) నిర్వహిస్తున్న రెండురోజుల అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని మానెక్‌షా సెంటర్‌లో ‘భారత విద్యుత్‌ రంగాన్ని ఏఐ ఆధారితంగా తీర్చిదిద్దడం’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యుదుత్పత్తి నుంచి వినియోగదారుల సేవల వరకు వివిధ దశల్లో ఏఐ అనువర్తనాలపై తొలిరోజు విస్తృత చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్‌, ప్రహ్లాద్‌ జోషి తమ సందేశాలను అందించారు. ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రులు శ్రీపాద్‌ యెస్సో నాయక్‌, జితిన్‌ ప్రసాద, కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శి పంకజ్‌ అగర్వాల్‌, సీఈఏ చైర్‌పర్సన్‌ ఘన్‌శ్యామ్‌ ప్రసాద్‌, నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మయాంక్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు.

మారుతున్న సాంకేతిక పరిణామాలు, కొత్త సవాళ్లకు అనుగుణంగా దేశ విద్యుత్‌ రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని పంకజ్‌ అగర్వాల్‌, మయాంక్‌ తివారీ వివరించారు. సదస్సు లక్ష్యాలను ఘన్‌శ్యామ్‌ ప్రసాద్‌ తెలియజేశారు. విద్యుత్‌ రంగంలోని అన్ని విభాగాల్లో ఏఐ వినియోగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సీఈఏ ఇప్పటికే 54 మంది ఏఐ ఔత్సాహికులు, ప్రచార రాయబారులతో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యుత్‌ సంస్థలు కూడా ప్రత్యేక ఏఐ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఆరు ప్రధాన అంశాలపై చర్చలు

తొలిరోజు సంప్రదాయ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంపు, నియంత్రణ సంస్కరణలు, పునరుత్పాదక విద్యుత్‌ అనుసంధానం, పంపిణీ వ్యవస్థల ఆధునికీకరణ, ట్రాన్స్‌మిషన్‌–గ్రిడ్‌ స్థిరత్వం, రూఫ్‌టాప్‌ సోలార్‌–మైక్రోగ్రిడ్‌లు–మినీగ్రిడ్‌లలో ఏఐ వినియోగం అనే ఆరు అంశాలపై సమాంతర సాంకేతిక సమావేశాలు నిర్వహించారు.

సంప్రదాయ విద్యుత్‌ కేంద్రాల్లో ఇంధన వినియోగ సామర్థ్యం, దహన ప్రక్రియ మెరుగుదల, పరికరాల లోపాలను ముందుగానే గుర్తించడం, ఉద్గారాల పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలించారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా సంప్రదాయ కేంద్రాలను సౌకర్యవంతంగా నిర్వహించడంలో ఏఐ పాత్రపై చర్చించారు.

నియంత్రణ వ్యవస్థల్లో విద్యుత్‌ చార్జీల ప్రతిపాదనలు, ఆదాయ అవసరాల పరిశీలన, సమర్పించిన వివరాల ధ్రువీకరణ, నిబంధనల అమలు పర్యవేక్షణకు ఏఐను ఉపయోగించే అవకాశాలను ప్రస్తావించారు. అయితే ఏఐ మానవ పర్యవేక్షణలో నిర్ణయాలకు సహాయక సాధనంగా పనిచేయాలని, చట్టబద్ధ నిర్ణయాధికారం, నిష్పాక్షిక ప్రక్రియలు, నియంత్రణ సంస్థల జవాబుదారీతనాన్ని భర్తీ చేయకూడదని చర్చల్లో స్పష్టం చేశారు.

నమ్మకమైన సరఫరా.. మెరుగైన వినియోగదారుల సేవలు

పునరుత్పాదక విద్యుదుత్పత్తి, డిమాండ్‌ను ముందస్తుగా అంచనా వేయడం, విద్యుత్‌ నిల్వ వ్యవస్థల సమర్థ వినియోగం, నెట్‌వర్క్‌లో రద్దీ నిర్వహణ, వర్చువల్‌ పవర్‌ ప్లాంట్ల ద్వారా వివిధ వనరులను సమన్వయం చేయడంపై చర్చించారు. స్మార్ట్‌ మీటర్లు, విద్యుత్‌ నెట్‌వర్క్‌, పరికరాల సమాచారం ఆధారంగా పంపిణీ వ్యవస్థలను మెరుగుపరిచే అవకాశాలను పరిశీలించారు.

ట్రాన్స్‌ఫార్మర్లలో లోపాలను ముందుగానే గుర్తించడం, విద్యుత్‌ అంతరాయాల గుర్తింపు, లోపాలున్న ప్రాంతాలను నిర్ధారించడం, నష్టాల విశ్లేషణ, బిల్లింగ్‌, వినియోగదారుల సేవలు వంటి విభాగాల్లో ఏఐ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థలో డ్రోన్లతో తనిఖీలు, కంప్యూటర్‌ విజన్‌, డిజిటల్‌ ట్విన్స్‌, గ్రిడ్‌ స్థిరత్వం, విద్యుత్‌ వ్యవస్థ పునరుద్ధరణ సన్నద్ధతపైనా చర్చలు సాగాయి.

రూఫ్‌టాప్‌ సోలార్‌కు అనువైన భవనాల గుర్తింపు, అవసరమైన సామర్థ్యం నిర్ధారణ, మైక్రోగ్రిడ్‌ల స్వయంచాలక నిర్వహణ, బ్యాటరీలు, విద్యుత్‌ వాహనాలు, వినియోగ అవసరాలను సమన్వయం చేసే విధానాలను పరిశీలించారు.

విశ్వసనీయ సమాచారం, సైబర్‌ భద్రత కీలకం

విడివిడిగా నిర్వహించే సాంకేతిక ప్రదర్శనల నుంచి ఆచరణలో అమలు చేయగల ప్రాధాన్య కార్యక్రమాల దిశగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని చర్చల్లో ప్రస్తావించారు. ఇందుకు విశ్వసనీయ సమాచారం, వ్యవస్థల మధ్య అనుసంధానం, సైబర్‌ భద్రత, తగిన రక్షణ చర్యలు, సిబ్బంది నైపుణ్యాభివృద్ధి, ఫలితాలను కొలిచే సూచికలు అవసరమని పేర్కొన్నారు.

ప్రారంభ సమావేశంలో సీఈఏ ‘విద్యుత్‌ ద్వార్‌’ పోర్టల్‌ను ప్రారంభించడంతోపాటు ‘ట్రాన్స్‌మిషన్‌ ప్లానింగ్‌ క్రైటీరియా–2026’ మాన్యువల్‌ను విడుదల చేశారు. విశిష్ట సేవలందించిన సీఈఏ ఉద్యోగులకు పురస్కారాలను ప్రదానం చేశారు. సమర్థమైన విద్యుత్‌ సరఫరా, నమ్మకమైన గ్రిడ్‌ వ్యవస్థలు, మెరుగైన సేవలు, సురక్షిత డిజిటలీకరణ లక్ష్యంగా ఏఐ వినియోగానికి సమన్వయ కార్యాచరణ రూపొందించేందుకు ఈ సదస్సు చర్చలు దోహదపడనున్నాయి.

यह भी पढ़ें