Thursday15 October 2026Hyderabad

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
HYD 22K₹1,36,471/10g-0.91%
Languages

Latest News

‎నాణ్యతా ప్రమాణాల్లో టీజీఎస్పీడీసీఎల్‌ సరికొత్త మైలురాయి నాలుగు అంతర్జాతీయ నాణ్యతా గుర్తింపులు.. విద్యుత్‌ పంపిణీ రంగంలో మరో ముందడుగు ‎ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా గుర్తింపులు స్వీకరించిన సీఎండీ జితేష్‌ పాటిల్‌

nagendra15 October 2026, 2:30 AM0 viewstrinetnews.com
‎నాణ్యతా ప్రమాణాల్లో టీజీఎస్పీడీసీఎల్‌ సరికొత్త మైలురాయి నాలుగు అంతర్జాతీయ నాణ్యతా గుర్తింపులు.. విద్యుత్‌ పంపిణీ రంగంలో మరో ముందడుగు ‎ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా గుర్తింపులు స్వీకరించిన సీఎండీ జితేష్‌ పాటిల్‌

Share this story

Share link keeps your language (?lang=)

‎

‎నాణ్యతా ప్రమాణాల్లో టీజీఎస్పీడీసీఎల్‌ సరికొత్త మైలురాయి

నాలుగు అంతర్జాతీయ నాణ్యతా గుర్తింపులు.. విద్యుత్‌ పంపిణీ రంగంలో మరో ముందడుగు

‎ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా గుర్తింపులు స్వీకరించిన సీఎండీ జితేష్‌ పాటిల్‌

‎హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,

అక్టోబర్ 14: విద్యుత్‌ పంపిణీ రంగంలో నాణ్యతా ప్రమాణాల అమలు, సమాచార భద్రత, స్టోర్స్‌ నిర్వహణ, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీఎస్పీడీసీఎల్ ) మరో కీలక మైలురాయిని అధిగమించింది. అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా సంస్థకు నాలుగు నాణ్యతా గుర్తింపులు లభించాయి. నాణ్యతా నిర్వహణకు సంబంధించి సమాచార భద్రతకు 27001, స్టోర్స్‌ నిర్వహణలో జపనీస్‌ 5S విధానం, వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తున్నందుకు క్వాలిటీ మార్క్‌ గుర్తింపులు దక్కాయి. సంస్థలో నిర్వహణ సామర్థ్యం, సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు చేపడుతున్న చర్యలకు ఈ గుర్తింపులు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి. పాటిల్‌ ఐఏఎస్‌ ఈ నాలుగు గుర్తింపులను స్వీకరించారు. ఐఎస్ఓ

ఆడిటర్‌ శివయ్య సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, సంస్థ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) డాక్టర్‌ ఎన్‌. నర్సింహులు, కంపెనీ సెక్రటరీ అనిల్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ (రూరల్‌) బాలస్వామి తదితర అధికారులు పాల్గొన్నారు.

‎

‎నాణ్యతా నిర్వహణకు ISO 9001

‎

‎సంస్థలోని కార్యాలయాలు, వివిధ విభాగాల్లో నాణ్యతా నిర్వహణ విధానాలను సమర్థంగా అమలు చేయడం, రికార్డుల నిర్వహణ, అంతర్గత నియంత్రణ, పర్యవేక్షణ, కార్యాచరణ ప్రక్రియలను మెరుగుపరచడం, నిరంతర అభివృద్ధికి కృషి చేయడం వంటి అంశాలకు సంబంధించి ఐ ఎస్ఓ 9001 గుర్తింపు లభించింది. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా విధులను నిర్వహిస్తూ, సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి ఈ ప్రమాణం దోహదపడుతుంది. సంస్థలో జవాబుదారీతనం పెంపొందించడంతోపాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన నిర్వహణ విధానాలకు ఇది ప్రాధాన్యతనిస్తుంది.

‎

‎సమాచార భద్రతకు పెద్దపీట

‎

‎ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సమాచార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంది. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థకు సంబంధించిన ఐటీ నెట్‌వర్క్‌లు, కీలక సమాచారం, డేటా పరిరక్షణ, సమాచార ప్రాప్యతపై నియంత్రణ, సైబర్‌ ముప్పుల నిర్వహణ వంటి అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నందుకు ఐఎస్ఓ

27001 గుర్తింపు లభించింది. సంస్థ సమాచార గోప్యత, సమగ్రతను కాపాడటంతోపాటు అవసరమైన సమయంలో సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ఈ ప్రమాణం ఉపయోగపడుతుంది. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ గుర్తింపు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

‎

‎స్టోర్స్‌ నిర్వహణలో జపనీస్‌ 5S విధానం

‎

‎విద్యుత్‌ పంపిణీ వ్యవస్థకు అవసరమైన పరికరాలు, సామగ్రి నిల్వ, వాటి నిర్వహణలో క్రమశిక్షణను పెంపొందించేందుకు జపాన్‌లో అభివృద్ధి చేసిన 5S విధానాన్ని అమలు చేయడం ద్వారా మరో గుర్తింపు లభించింది. స్టోర్స్‌లో పరిశుభ్రత, క్రమబద్ధీకరణ, ప్రమాణీకరణ, క్రమశిక్షణ, నిరంతర అభివృద్ధికి ఈ విధానం ప్రాధాన్యతనిస్తుంది. విద్యుత్‌ సరఫరా, నిర్వహణ పనులకు అవసరమైన సామగ్రిని సక్రమంగా నిల్వ చేయడం, సులభంగా గుర్తించడం, నిల్వల వివరాలను పక్కాగా నిర్వహించడం, అవసరమైన సమయంలో వాటిని అందుబాటులోకి తీసుకురావడంలో ఈ విధానం కీలకంగా ఉంటుంది. తద్వారా నిర్వహణ పనుల్లో జాప్యాన్ని తగ్గించి, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

‎

‎నాణ్యమైన సేవలకు క్వాలిటీ మార్క్‌

‎

‎వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్‌ సేవలు అందించేందుకు గత ఐదేళ్లుగా టీజీఎస్పీడీసీఎల్‌ చేస్తున్న కృషికి గుర్తింపుగా క్వాలిటీ మార్క్‌ లభించింది. విద్యుత్‌ సేవల నాణ్యత, కార్యనిర్వహణ సామర్థ్యం, సేవల్లో నిరంతర మెరుగుదల, వినియోగదారుల సంతృప్తికి సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ గుర్తింపు ప్రతిబింబిస్తోంది. విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సంస్థ చేపడుతున్న చర్యలకు ఇది ప్రోత్సాహాన్నివ్వనుంది.

‎

‎ప్రభుత్వ ప్రోత్సాహం.. ఉద్యోగుల సమష్టి కృషి

‎

‎రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం విద్యుత్‌ రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలకు ఈ గుర్తింపులు ప్రాధాన్యతను చేకూర్చాయి. సంస్థలోని అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తూ నాణ్యతా ప్రమాణాలను పాటించడం, సమాచార భద్రతను బలోపేతం చేయడం, స్టోర్స్‌ నిర్వహణను క్రమబద్ధీకరించడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాల్లో చేస్తున్న కృషికి ఈ గుర్తింపులు ప్రతిఫలంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల అంకితభావం, సమష్టి కృషితోనే ఇటువంటి విజయాలు సాధ్యమవుతున్నాయని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. భవిష్యత్తులోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడం, నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం, వినియోగదారుల సంతృప్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా టీజీఎస్పీడీసీఎల్‌ ముందుకు సాగుతోంది. నాలుగు నాణ్యతా గుర్తింపులు సంస్థకు గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించేందుకు స్ఫూర్తినిస్తున్నాయి. నాణ్యతను కేవలం ధ్రువపత్రాలకే పరిమితం చేయకుండా, ప్రతి ప్రక్రియలో క్రమశిక్షణను, ప్రతి పనిలో జవాబుదారీతనాన్ని, ప్రతి సేవలో నిబద్ధతను పాటిస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడమే సంస్థ ముందున్న లక్ష్యమని సీఎండీ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు.

‎

Also read