న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 14:
ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ ఆసుపత్రి (రీసెర్చ్ అండ్ రెఫరల్) నర్సింగ్ కళాశాలకు చెందిన తొమ్మిదో బ్యాచ్‌లోని 29 మంది నర్సింగ్ క్యాడెట్లు మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌లో లెఫ్టినెంట్లుగా నియమితులయ్యారు. బుధవారం ఆర్మీ ఆసుపత్రిలో నిర్వహించిన నియామక వేడుకలో ఆసుపత్రి కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ అవినాశ్ దాస్ పరేడ్‌ను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ, విద్యాపరమైన విజయాలు సాధించి సత్కారాలు అందుకున్న క్యాడెట్లను అభినందించారు. నూతన నర్సింగ్ అధికారులు సైనిక సిబ్బందికి, వారి కుటుంబాలకు ఆదర్శప్రాయమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. మిలిటరీ నర్సింగ్ సర్వీస్ విలువలు, సంస్కృతి, ఘనమైన సంప్రదాయాలను కాపాడుతూ విధులు నిర్వర్తించాలని సూచించారు. దేశానికి 101 సంవత్సరాలుగా అంకితభావం, కరుణ, నిస్వార్థ సేవలు అందిస్తున్న మిలిటరీ నర్సింగ్ సర్వీస్‌ను ప్రశంసించారు.
నూతన అధికారులు నాలుగేళ్ల కఠోర శిక్షణ, సమగ్ర విద్యాభ్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. లెఫ్టినెంట్ హోదా స్వీకరించిన అనంతరం వృత్తిపరమైన అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సేవకే ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
వేడుకలో సీనియర్ సైనిక అధికారులు, నర్సింగ్ అధికారులు, అధ్యాపకులు, నూతన అధికారుల తల్లిదండ్రులు, బంధువులు పాల్గొన్నారు.





