Thursday15 October 2026Hyderabad

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
HYD 22K₹1,36,471/10g-0.91%
Languages

Latest News

నకిలీ వ్యవసాయ కళాశాలలకు కళ్లెం త్వరలో వ్యవసాయ మండలి ఏర్పాటు: కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్

nagendra15 October 2026, 2:25 AM0 viewstrinetnews.com
నకిలీ వ్యవసాయ కళాశాలలకు కళ్లెం త్వరలో వ్యవసాయ మండలి ఏర్పాటు: కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్

Share this story

Share link keeps your language (?lang=)

  • న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 14:

ప్రమాణాలు పాటించకుండా నకిలీ డిగ్రీలు జారీ చేస్తున్న ప్రైవేటు వ్యవసాయ కళాశాలలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. వ్యవసాయ విద్యలో నాణ్యత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు త్వరలో వ్యవసాయ మండలిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలోని పూసాలో బుధవారం నిర్వహించిన అగ్రివిజన్ 10వ జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు.

వ్యవసాయ విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని చౌహాన్ పేర్కొన్నారు. విద్యాసంస్థలు కేవలం ఫీజులు వసూలు చేసి డిగ్రీలు అందించే వ్యాపార కేంద్రాలుగా మారడాన్ని అనుమతించబోమన్నారు. యువత సమయం, శ్రమ, డబ్బు వెచ్చించి అభ్యసిస్తున్న బీఎస్సీ వ్యవసాయం, ఎమ్మెస్సీ వ్యవసాయం వంటి విద్యార్హతలు వృథా కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. నాణ్యమైన విద్య ద్వారా విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడంతోపాటు వ్యవసాయ రంగానికి వారి సేవలు ఉపయోగపడేలా చూడాలన్నారు.

ప్రపంచానికి ఆహార భాండాగారంగా భారత్

ఒకప్పుడు పీఎల్–480 కార్యక్రమం కింద ఆహార ధాన్యాల దిగుమతులపై ఆధారపడిన భారత్, నేడు రైతుల కృషి, ఆధునిక విధానాలతో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిందని మంత్రి తెలిపారు. 2014 నుంచి 2024 మధ్య దేశంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తి 49 శాతం పెరిగిందన్నారు. బియ్యం ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో, గోధుమ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు.

ఉత్పత్తిని పెంచడమే కాకుండా శాస్త్రీయ నిల్వలు, సమర్థ నిర్వహణ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతుల విస్తరణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల జీవనోపాధిని మరింత మెరుగుపరుస్తూ, రానున్న సంవత్సరాల్లో భారత్ తన ఆహార అవసరాలను తీర్చుకోవడంతోపాటు ప్రపంచానికి ఆహార భాండాగారంగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మీ ఆలోచనలను కార్యాచరణగా మారుస్తాం

వ్యవసాయ విధానాల రూపకల్పనలో విద్యార్థులు, నిపుణులు, రైతు సంఘాల సూచనలు కీలకమని చౌహాన్ అన్నారు. సదస్సులో విస్తృతంగా చర్చించి వ్యవసాయాభివృద్ధికి ఉపయోగపడే ఆచరణాత్మక సిఫార్సులను అందించాలని కోరారు. ‘‘మీరు మేధోమథనం చేసి ఆలోచనల అమృతాన్ని అందించండి.. వాటిని దేశ ప్రయోజనాల కోసం అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది’’ అని పేర్కొన్నారు.

సదస్సు తీర్మానాల ఆధారంగా సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు 15 రోజుల నుంచి నెల రోజుల్లోపు ప్రతినిధులతో మరోసారి సమావేశమవుతానని తెలిపారు. రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు.

చిన్న రైతులకు సమీకృత వ్యవసాయమే దారి

దేశంలో సగటు భూకమతం కేవలం 0.96 హెక్టార్లు ఉన్న నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వ్యవసాయ వైవిధ్యీకరణ అవసరమని మంత్రి పేర్కొన్నారు. ధాన్యం సాగుతోపాటు పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కల పెంపకం, పశుపోషణ, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. సమీకృత వ్యవసాయం ద్వారా ఒకే పంటపై ఆధారపడటాన్ని తగ్గించి, రైతు కుటుంబాలకు బహుళ ఆదాయ వనరులు కల్పించవచ్చన్నారు.

వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. పంటల వైవిధ్యీకరణకు సాంకేతికతను జోడించడం ద్వారా ఉత్పాదకతను పెంచి రైతుల జీవనోపాధిని మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అగ్రివిజన్ పదేళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also read