గురువారం15 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,997+0.72%
NIFTY22,741+0.98%
22K₹1,35,845/10g-0.58%
భాషలు

తాజా వార్తలు

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి యువత, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి.. పెట్టుబడులకు ప్రభుత్వ భరోసా: ముఖ్యమంత్రి

nagendra15 October 2026, 2:13 AM0 చూసులుtrinetnews.com
తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి యువత, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి.. పెట్టుబడులకు ప్రభుత్వ భరోసా: ముఖ్యమంత్రి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 14:

తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతో పాటు, రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సమాఖ్య బిజినెస్ సమ్మిట్-2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యువతతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సూచించారు.

సమాఖ్యలతో కొత్త తరానికి దిశానిర్దేశం

సమాఖ్య అనే పదానికి ఎంతో బలం ఉందని సీఎం అన్నారు. పురాతన కాలంలో వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వ్యాపారాలు సాగేవని, ఆధునిక యుగంలోనూ సమాఖ్యల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార అవకాశాలను తెలుసుకోవడానికి, వాటిని అందిపుచ్చుకోవడానికి సమాఖ్యలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

కొత్త తరం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు వివిధ హోదాల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవడమే కాకుండా, ఇతరులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఇలాంటి విజయగాథలను సమాఖ్య నిక్షిప్తం చేసి, భావితరాలకు అందించాలని సూచించారు.

2047 లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ విజన్

2047 నాటికి స్వతంత్ర భారతదేశం వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో, వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో రాష్ట్రాల సహకారం కీలకమని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే 2025లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రాన్ని 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.

క్యూర్ , ప్యూర్ ,రేర్ తో సమగ్ర అభివృద్ధి

తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని క్యూర్(కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఐటీ, సేవా రంగాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని ప్యూర్ (పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ)గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇక్కడ తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ రంగాలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలను రేర్ (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ)గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, గ్రామీణ ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని వివరించారు. ఈ మూడు విభాగాల సమన్వయంతో రాష్ట్రంలోని పట్టణ, పారిశ్రామిక, గ్రామీణ ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచాలి

ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ వాటా ఐదు శాతంగా ఉందని సీఎం తెలిపారు. ఈ వాటాను పది శాతానికి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ, ప్రపంచస్థాయి వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు వందల ఏళ్ల క్రితమే దేశవిదేశాల నుంచి వచ్చే వ్యాపారవేత్తలకు హైదరాబాద్‌లోని చార్మినార్ ఒక ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌గా నిలిచిందని గుర్తుచేశారు. ప్రస్తుతం వ్యాపార రంగానికి హైటెక్ సిటీ మరో కీలక గుర్తింపుగా మారిందన్నారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంలో పారిశ్రామికవేత్తలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సర్వీస్ ప్రొవైడర్ల నుంచి గ్లోబల్ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఇప్పటివరకు తెలంగాణకు చెందిన అనేక మంది కార్పొరేట్ కంపెనీలకు సేవలందించే దిశగా ఎక్కువగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఇకపై మన ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలు స్వయంగా పెట్టుబడులు పెట్టి, వ్యాపారాలను విస్తరించి, అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. స్థానిక పారిశ్రామికవేత్తలు ప్రపంచ మార్కెట్లలో పోటీపడే స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్న దేశాలు ఆర్థికంగా బలోపేతం అయ్యాయని సీఎం పేర్కొన్నారు. అందువల్ల మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం అత్యంత అవసరమని అన్నారు. తెలంగాణలో మహిళలకు రూ.61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించినట్లు వెల్లడించారు. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణలో మహిళలను యజమానులుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడంతో పాటు వ్యాపార రంగంలోనూ కీలక పాత్ర పోషించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.

సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ యువతతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ దిశగా ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడే మంచి విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని, పెట్టుబడిదారులకు పూర్తి భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని పెట్టుబడులు, ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దడంలో సమాఖ్యలు కీలక భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి