న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 13:
డిజిటల్ పాలనను బలోపేతం చేస్తూ కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ (డీఏహెచ్డీ) పునరుద్ధరించిన వెబ్సైట్ను కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ రూపొందించిన డిజిటల్ బ్రాండ్ ఐడెంటిటీ మాన్యువల్ (డీబీఐఎం) వెర్షన్ 3.0 ప్రమాణాలకు అనుగుణంగా ఈ వెబ్సైట్ను అభివృద్ధి చేశారు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు ఈ వెబ్సైట్ కీలక ముందడుగని మంత్రి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘డిజిటల్ ఇండియా’, ‘కనిష్ఠ ప్రభుత్వం–గరిష్ఠ పాలన’ దృక్పథానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వెబ్సైట్ రూపకల్పనలో కృషి చేసిన శాఖ ఐటీ బృందం, జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ)ను అభినందించారు.
పశువుల ఆరోగ్యం, పశుసంవర్ధక పథకాలు, పాడి పరిశ్రమ అభివృద్ధి, పశు నిర్వహణతోపాటు శాఖ కార్యక్రమాలు, సేవల సమాచారాన్ని తెలుసుకునేందుకు కొత్త వెబ్సైట్ను వినియోగించుకోవాలని సంబంధిత వర్గాలకు మంత్రి సూచించారు.
వినియోగదారులు సమాచారాన్ని సులభంగా వెతికేందుకు అధునాతన శోధన సదుపాయం కల్పించారు. ‘భాషిణి’ ద్వారా బహుభాషా సేవలు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా విభాగాలను చేరుకునే సౌలభ్యం, కేంద్రీకృత సమాచార నిర్వహణ వంటి ప్రత్యేకతలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, రాష్ట్రీయ గోకుల్ మిషన్, జాతీయ పశుసంపద మిషన్, పశువుల ఆరోగ్యం–వ్యాధి నియంత్రణ కార్యక్రమం తదితర ప్రధాన పథకాల సమాచారాన్ని ఒకేచోట పొందేలా వెబ్సైట్ను రూపొందించారు. పథకాల వివరాలు, మార్గదర్శకాలు, సంబంధిత వనరులు, డిజిటల్ వేదికలను సులభంగా చేరుకునేందుకు ఇది ఉపయోగపడనుంది.





