Wednesday14 October 2026Hyderabad

SENSEX73,060+2.05%
NIFTY22,689+2.06%
HYD 22K₹1,36,456/10g-0.73%
Languages

Latest News

• ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ కోర్ ఏరియాలో తాగునీటి సరఫరాకు పటిష్టమైన చర్యలు • ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు

nagendra14 October 2026, 1:40 AM0 viewstrinetnews.com
• ఎల్-నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ కోర్ ఏరియాలో తాగునీటి సరఫరాకు పటిష్టమైన చర్యలు • ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు

Share this story

Share link keeps your language (?lang=)

• నీటిని 20 శాతం పొదుపు చేస్తే రోజుకు 80 ఎంజీడీల నీరు ఆదా

• నీటి పొదుపుపై 60 రోజుల పాటు విస్తృత ప్రజా చైతన్య కార్యక్రమాలు

• మల్లన్నసాగర్ నుంచి నవంబర్‌లో అదనంగా 20 ఎంజీడీల నీటి వినియోగానికి ఏర్పాట్లు

• తాగునీటి సరఫరాకు నిధుల కొరత లేదు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,

అక్టోబర్ 13: ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా హైదరాబాద్ కోర్ ఏరియాలో అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ, ప్రభుత్వ చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి (ఎంఎంసి), సైబరాబాద్ (సిఎంసి) మున్సిపల్ కార్పొరేషన్లలో తాగునీటి సరఫరా సన్నద్ధతపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ స్పెషల్ సిఎస్ దాన కిషోర్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల కమిషనర్లు ఆర్.వి. కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సృజనతో పాటు నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఎల్-నినో ప్రభావంతో రిజర్వాయర్లలో నీటి లభ్యత తగ్గినప్పటికీ, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నగరానికి అదనంగా 60 ఎంజీడీల నీటి వినియోగానికి ప్రణాళిక హైదరాబాద్ కోర్ ఏరియాకు ప్రధానంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, మంజీరా, కృష్ణా, గోదావరి నదుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని, ఈ నీటి వనరుల పరిధిలో ప్రస్తుతం 560 ఎంజీడీల నీటి లభ్యత ఉందని వివరించారు.

నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా నది నుంచి అదనంగా 15 ఎంజీడీలు, మిషన్ భగీరథ ద్వారా 20 ఎంజీడీలతోపాటు అదనంగా మరో 20 ఎంజీడీలు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి మరో 5 ఎంజీడీల చొప్పున మొత్తం 60 ఎంజీడీల అదనపు నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మల్లన్నసాగర్‌లో 5 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, అక్కడి నుంచి నగరానికి నీటిని తరలించే పైప్‌లైన్ నిర్మాణం నవంబర్‌లో పూర్తికానున్నందున, ఆ వనరు ద్వారా అదనంగా 20 ఎంజీడీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే గత రెండు మూడు నెలలుగా నగరంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయని, ఫలితంగా నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందన్నారు. శుద్ధి చేసిన నీటిని గృహేతర అవసరాలకు వినియోగించాలి

నగరంలోని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లలో ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టీపీలు) పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్ నిర్వహణ, వాహనాల శుభ్రత, ఇతర గృహేతర అవసరాలకు వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. శుద్ధి చేసిన నీటిని వినియోగించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు జలమండలి అధికారులు సమావేశంలో వివరించారు.

మంజీరా, సింగూరు పరిధిలోని జిల్లాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

మంజీరా, సింగూరు రిజర్వాయర్ల ద్వారా నీటిని పొందుతున్న మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేయనున్నట్లు సిఎస్ తెలిపారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే బోరుబావులు, ఇతర నీటి వనరులను గుర్తించినట్లు పేర్కొన్నారు. తాగునీటి సరఫరాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అవసరమైన నిధులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

20 శాతం నీటి పొదుపుతో రోజుకు 80 ఎంజీడీల ఆదా

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో ప్రజలు కేవలం 20 శాతం నీటిని పొదుపుగా వినియోగించినా రోజుకు 80 ఎంజీడీల నీటిని ఆదా చేయవచ్చని ప్రధాన కార్యదర్శి తెలిపారు.

జలమండలి సరఫరా చేసే తాగునీటితో వాహనాలను కడగడం, నీటిని వృథా చేయడం వంటి చర్యలను కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి పొదుపు, వృథా నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 60 రోజుల పాటు విస్తృత స్థాయిలో ప్రచార, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో సినిమా నటులు, ప్రముఖులు, సెలబ్రిటీలను భాగస్వాములను చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని తెలిపారు.

ప్రతి నీటి చుక్కను విలువైన వనరుగా భావించి పొదుపుగా వినియోగించడం ద్వారా ఎల్-నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని, ఈ ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పిలుపునిచ్చారు.

Also read