నల్లగొండ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 11:
గుడిసె లేని తెలంగాణ నిర్మాణమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యమని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పాలనకు ప్రాధాన్యత ఇస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందించడంతో పాటు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్న బియ్యాన్ని ముఖ్యమంత్రి, తాను కూడా తింటున్నామని మంత్రి చెప్పారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ సన్న బియ్యం తింటూ ప్రజలకు దొడ్డు బియ్యం పెట్టేవారని విమర్శించారు.
ఎల్‌నినోతో కరువు పరిస్థితులు
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, వర్షాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన తనకు రైతుల కష్టాలు తెలుసని అన్నారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిన నేపథ్యంలో తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అధికారులతో చర్చించి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం
గత పదేళ్లలో కేసీఆర్‌కు కుర్చీపై ఉన్న ధ్యాస తప్ప ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న శ్రద్ధ లేదని మంత్రి విమర్శించారు. అప్పట్లో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో పులిచింతల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు మూడో పంటకు నీటిని తరలిస్తున్న సమయంలో తాను అడ్డుకున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తుచేశారు.
రెండేళ్లలో సొరంగం పూర్తి చేస్తాం
రాబోయే రెండేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని పూర్తి చేసి నల్లగొండ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కృష్ణా నది జలాలతో నల్లగొండ జిల్లా ప్రజల కాళ్లు తడుపుతానని మాట ఇస్తున్నానన్నారు. జిల్లా రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నీటి లభ్యత, ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి అవసరాలపై అధికారులతో చర్చించి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.





