Monday12 October 2026హైదరాబాద్

SENSEX72,265-1.10%
NIFTY22,458-1.40%
HYD 22K₹1,38,651/10g+1.94%
भाषाएँ

Latest News

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి

• గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి • జనసైనికుల త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి • స్థానిక ఎన్నికల్లో జన సైనికులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి • గిరిజన గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది • ప్రజా అవసరాలను విస్మరించి.. పార్టీ రంగుల కోసం వందల కోట్ల ఖర్చు చేసింది • రాజకీయాలకు అతీతంగా గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా నిధుల కేటాయించాము • ⁠రహదారులు, ఉపాధి, వైద్య సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకున్నాం • అడవితల్లి బాట 2.0 ద్వారా రూ.2,052 కోట్లతో 2,569 పనులకు శ్రీకారం -ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్

nagendra12 October 2026, 2:41 AM2 व्यूtrinetnews.com
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి

Share this story

Share link keeps your language (?lang=)

అమరావతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 11:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలిచి, కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కూటమిలోని అన్ని పార్టీల నాయకులు, జన సైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతూ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు. కూటమి ఏర్పాటు, విజయం కోసం జనసేన పార్టీ, జనసైనికులు ఎన్నో త్యాగాలు చేశారని, వారి త్యాగాలను గుర్తిస్తూ పొత్తు ధర్మానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జనసైనికుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ కోసం, కూటమి కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం లభించేలా కూటమిలోని ప్రతి నాయకుడు అండగా నిలవాలని కోరారు. ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కాకవాడలో అడవితల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “2014లో కూటమికి మద్దతుగా నిలిచినప్పుడు ఏ ఒక్క జనసైనికుడు పదవులూ ఆశించలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి నిస్వార్థంగా పని చేశారు. పార్టీ కోసం, కూటమి కోసం తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి ఎన్నో త్యాగాలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో కూడా జనసైనికులు, వీరమహిళలు రోడ్లపైకి వచ్చి తమ సంఘీభావాన్ని చాటారు. కష్టకాలంలో అండగా నిలిచిన వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ జనసైనికులు, వీరమహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. వారి త్యాగాలకు తగిన గౌరవం లభించాలి. పదవులు ఆశించకుండా అండగా నిలిచిన వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి.

అడవితల్లి బాట లక్ష్యం అదే

గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించి, వాటిని అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రహదారుల నిర్మాణం ద్వారా గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, రవాణా, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పీఎం-జన్మన్, పీఎంజీఎస్‌వై-4, ఉపాధి హామీ పథకాల సమన్వయంతో ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం, శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, ఏలూరు జిల్లాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం కింద 858 గిరిజన ఆవాసాలకు 1,662 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి రూ.1,406 కోట్లతో పనులు చేపట్టాం. ఇదే స్ఫూర్తితో అడవితల్లి బాట 2.0 ద్వారా మరో 1,341 ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల మేర రహదారులు, 45 వంతెనల నిర్మాణం కోసం రూ.2,052 కోట్లతో మొత్తం 2,569 పనులను మంజూరు చేశాం. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంగా ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గిరిజన గ్రామాలను సందర్శించి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి ఎంత దూరంగా ఉన్నాయో అర్థం చేసుకున్నానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాం అని అన్నారు. అయితే, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం సాధారణ గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. కొండల మధ్య కిలోమీటర్ల మేర మార్గాలను ఏర్పాటు చేయడంతోపాటు, భారీ బండరాళ్లను తొలగించాలన్నారు.

అవసరమైన చోట రాక్ కట్టింగ్, కంట్రోల్ బ్లాస్టింగ్ చేపట్టాలి. కొండ వాలులను స్థిరపరిచి, రహదారికి పటిష్ఠమైన పునాది వేసిన తర్వాత గ్రావెల్, ఇతర పొరలను ఏర్పాటు చేసి బీటీ రోడ్డు నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు.

83 వేల మంది రైతులకు లబ్ధి*

గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయాన్ని కల్పించి, వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఉద్యానవనాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉపాధి హామీ, వీబీ-జీ రామ్ జీ పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో 85 వేల ఎకరాల్లో ఉద్యానవనాలను అభివృద్ధి చేసి, సుమారు 83 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చాం అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ సాగును ప్రోత్సహించడంతో పాటు, కాఫీ తోటలకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ వంటి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం అని వివరించారు. అలాగే, గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు సుంకరమెట్ట కాఫీ తోటల్లో వుడెన్ బ్రిడ్జి, కానోపీ వాక్‌లను నిర్మించాం అన్నారు. మారేడుమిల్లిలో 11 హెక్టార్ల విస్తీర్ణంలో అరోమా కానోపీ వాక్, ట్రెక్కింగ్ వంటి కార్యకలాపాల ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నాం అని తెలిపారు. నల్లమలలో జంగిల్ సఫారీని అభివృద్ధి చేయడం ద్వారా చెంచు గిరిజన కుటుంబాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించడంలో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు. ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులను శిలాఫలకాల ఏర్పాటు కోసం, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం కోసం, కోర్టుల ఆదేశాల తర్వాత ఆ రంగులను తొలగించి మళ్లీ కొత్త రంగులు వేయడం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అహంకారంతో ప్రజలను భయపెట్టే పరిస్థితులు ఉండకూడదు. తప్పును ప్రశ్నించే ధైర్యం ప్రజలకు ఉండాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను కూడా గుర్తించాలి. ధైర్యంగా ఉండాలి, బాధ్యతగా వ్యవహరించాలి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి” డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

यह भी पढ़ें