సోమవారం12 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,268-1.09%
NIFTY22,504-1.19%
22K₹1,38,736/10g+2.02%
భాషలు

తాజా వార్తలు

ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఎన్‌ఫోర్సబుల్ అధికారాలు కల్పించాలి: కల్వకుంట్ల కవిత

nagendra12 October 2026, 2:28 AM0 చూసులుtrinetnews.com
ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఎన్‌ఫోర్సబుల్ అధికారాలు కల్పించాలి: కల్వకుంట్ల కవిత

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

కమిషన్లకు బలమైన అధికారాల కోసం రాజ్యాంగ సవరణ జరగాలి

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలి

  1. హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 11:

ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు కేవలం సిఫారసులు చేసే అధికారాలే కాకుండా, తమ ఆదేశాలను అమలు చేయించగలిగే ఎన్‌ఫోర్సబుల్ అధికారాలు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణ జరగాలని, ఈ దిశగా ఎమ్మెల్యేలు, ఎంపీలు పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లతో పాటు మహిళా, మానవ హక్కుల, బాలల కమిషన్లు కూడా పూర్తిస్థాయి అధికారాలు లేకుండా పనిచేస్తున్నాయని కవిత అన్నారు. ఆయా కమిషన్లు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచించడం మినహా, తమ నిర్ణయాలను అమలు చేయించే అధికారం లేకపోవడం వల్ల బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. కమిషన్లకు రాజకీయ నాయకుడు చైర్మన్‌గా ఉండాలా, రిటైర్డ్ న్యాయమూర్తి ఉండాలా అన్నదానికంటే, వాటికి ఎలాంటి అధికారాలు ఉన్నాయన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు అవసరం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదని కవిత అభిప్రాయపడ్డారు. ఎస్సీల సమస్యలు, ఎస్టీల సమస్యలు భిన్నంగా ఉంటాయని, వాటిని ప్రత్యేకంగా పరిష్కరించేందుకు రెండు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఉండేవని గుర్తుచేశారు.

వివక్ష, దోపిడీ, అత్యాచారాలు, అణచివేత వంటి అనేక సమస్యలను ఎస్సీలు ఎదుర్కొంటున్నారని, ఎస్టీలకు సంబంధించిన సమస్యలు కూడా ప్రత్యేక దృష్టితో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తామని, అప్పటివరకు ఈ డిమాండ్ సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

అంబేడ్కర్ ఆశయాల సాధనకు ఉద్యోగులు కృషి చేయాలి

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సమాజ సమస్యలపై చర్చించేందుకు సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని కవిత అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను చూస్తే స్వర్గంలో ఉన్న అంబేడ్కర్ సంతోషిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ విధులకే పరిమితం కాకుండా సమాజ అభ్యున్నతికి కూడా కొంత సమయం కేటాయించాలని అంబేడ్కర్ పదేపదే కోరేవారని గుర్తుచేశారు. దేశంలో వేల సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు అనేక రకాల అన్యాయాలు, అణచివేతలను ఎదుర్కొన్నాయని ఆమె అన్నారు. ముఖ్యంగా ఎస్సీలు కనీస మానవ హక్కులకు కూడా నోచుకోని పరిస్థితుల్లో జీవించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ పోరాటం ద్వారా అణగారిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించాయని తెలిపారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా వెట్టిచాకిరి, భూస్వాముల దోపిడీ, సామాజిక వివక్ష వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఈ నేపథ్యంలో అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు కమిషన్ల అవసరం ఏర్పడిందని వివరించారు.

కమిషన్ల ఆదేశాలకు చట్టబద్ధమైన బలం ఉండాలి

ప్రస్తుతం కమిషన్లు ఇచ్చే నివేదికలు, సిఫారసులను ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి లేదని కవిత అన్నారు. నేరెళ్ల ఘటనను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఇప్పటివరకు ఎస్సీ కమిషన్ నివేదిక ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ నివేదిక వచ్చినా దాన్ని అమలు చేయాల్సిన తప్పనిసరి బాధ్యత ప్రభుత్వానికి లేకపోతే బాధితులకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.

కమిషన్లకు అధికారాలు ఉంటే బాధితులకు సత్వర న్యాయం అందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెబీ, ఎన్నికల కమిషన్ వంటి సంస్థలకు ఉన్న అధికారాలను ఉదాహరణగా పేర్కొంటూ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు కూడా బలమైన అధికారాలు కల్పించాలని కోరారు.

కమిషన్ల నిర్ణయాలను కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం ఉండటం, వాటి ఆదేశాల అమలుపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు కూడా సమస్యల పరిష్కారాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి దశాబ్దాలు గడిచినా అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణలో ఆశించిన మార్పులు రాకపోవడానికి కమిషన్లకు తగిన అధికారాలు లేకపోవడం కూడా ఒక కారణమని అన్నారు.

రాజకీయ వ్యవస్థలోనూ బాధ్యతాయుతమైన నాయకత్వం అవసరం

ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు రాజకీయ నాయకులను చైర్మన్లుగా నియమించకూడదన్న వాదనతో తాను ఏకీభవించనని కవిత అన్నారు. రాజకీయాలు హుందాగా, ప్రజల సమస్యలను అర్థం చేసుకునే విద్యావంతులు, బాధ్యతాయుతమైన వ్యక్తుల భాగస్వామ్యంతో సాగాలని ఆకాంక్షించారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు స్పందించి, వారి బాధను అర్థం చేసుకోగలిగే నాయకత్వం అవసరమని చెప్పారు. అన్ని రంగాల్లో ఉన్నట్లుగానే రాజకీయాల్లోనూ కొంతమంది చెడ్డవాళ్లు ఉండవచ్చని, అందువల్ల మొత్తం వ్యవస్థను తప్పుపట్టడం సరికాదని అన్నారు. కమిషన్లలో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలపై అవగాహన ఉన్నవారికి ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు.

అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలి

దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. వ్యాపార రంగంలో బలమైన సంస్థలకు ఉన్న అవకాశాలతో పోలిస్తే, దళిత పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణతో పాటు అన్ని కమిషన్లకు సమర్థవంతమైన అధికారాలు కల్పించేందుకు సమిష్టిగా పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు. రాజ్యాంగ సవరణ ద్వారా కమిషన్ల అధికారాలను బలోపేతం చేయాలని, అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి