సోమవారం12 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,313-1.03%
NIFTY22,496-1.23%
22K₹1,38,703/10g+1.98%
భాషలు

తాజా వార్తలు

ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురుచూపులు సర్వేలో తప్పుగా నమోదు చేశారని బాధిత కుటుంబం ఆవేదన

ఎల్‌3 నుంచి ఎల్‌1లోకి పేరు మార్చి ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి

nagendra12 October 2026, 2:27 AM0 చూసులుtrinetnews.com
ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురుచూపులు సర్వేలో తప్పుగా నమోదు చేశారని బాధిత కుటుంబం ఆవేదన

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, అక్టోబర్ 11 (ట్రైనెట్ న్యూస్): సొంత ఇల్లు లేకపోయినా సర్వే రికార్డుల్లో ఇంటి యజమానిగా నమోదు చేయడంతో ఇందిరమ్మ ఇల్లు పథకానికి దూరమవుతున్నామని చారకొండ మండలం జేపల్లి గ్రామానికి చెందిన మల్లెపాకుల పద్మ, ఆమె భర్త సైదులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాస్తవ పరిస్థితిని పరిశీలించి, రికార్డుల్లో వివరాలను సరిచేసి ఇల్లు మంజూరు చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు.

సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన ఇద్దరు తమ్ముళ్లు కొన్నేళ్ల క్రితం తమ సొంత డబ్బులతో ఇళ్లు నిర్మించుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను ఇల్లు నిర్మించుకోలేక తమ్ముళ్ల ఇంటి వద్ద తాత్కాలికంగా ఉంటున్నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో తమ్ముళ్ల ఇంటి ముందు తమ ఫొటో తీయవద్దని చెప్పినప్పటికీ, సర్వే సిబ్బంది ఫొటో తీసి తమను ఎల్‌3 జాబితాలో ఇంటి యజమానులుగా నమోదు చేశారని ఆరోపించారు.

ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో తమ పేరు ఎల్‌3 జాబితాలో ఉండటంతో అనర్హులుగా చూపుతున్నారని పద్మ పేర్కొన్నారు. తమ్ముళ్ల ఇంటిపై తమకు యాజమాన్య హక్కు లేదని అధికారులకు వివరించినా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోయారు.

కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదు

ఈ విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని పద్మ తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఇంటి యాజమాన్య వివరాలను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

“మాకు సొంత ఇల్లు లేకపోయినా ఉన్నట్లు నమోదు చేయడంతో పథకానికి దూరమవుతున్నాం. రికార్డుల్లో జరిగిన తప్పిదంతో మేమెందుకు నష్టపోవాలి?” అని బాధిత దంపతులు ప్రశ్నించారు.

సంబంధిత అధికారులు తమ ఫిర్యాదుపై స్పందించి, సర్వేలో నమోదైన వివరాలను పునఃపరిశీలించాలని కోరారు. ఎల్‌3లో ఉన్న తమ పేరును ఎల్‌1 జాబితాలో చేర్చి, అర్హత మేరకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని పద్మ, సైదులు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి