హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 11:
మానసిక ఆరోగ్య పరిరక్షణకు బాధలో ఉన్నవారి మాటలను శ్రద్ధగా వినడం, వారి అనుభవాలను అర్థం చేసుకోవడం, అవసరమైన సహాయం అందించడం ఎంతో ముఖ్యమని తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. మోతుకూరి రాంచందర్ పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (టీపీఏ) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఆధ్వర్యంలో నారాయణగూడలోని సత్యనారాయణ రెడ్డి భవన్లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీఏ రాష్ట్ర అధ్యక్షులు, డా. మోతుకూరి రాంచందర్ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్య సమస్యలను అనుభవించిన వ్యక్తుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, వారి అనుభవాల ఆధారంగా సేవలు, చికిత్సా విధానాలు, విధానపరమైన నిర్ణయాల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి, మార్కులపై ఆందోళన, కుటుంబ అంచనాలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సంబంధాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల మార్కులకే కాకుండా వారి భావోద్వేగ ఆరోగ్యానికీ ప్రాధాన్యం ఇవ్వాలని, పాఠశాలలు, కళాశాలల్లో కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను విస్తరించాలని కోరారు. .గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని, జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం, జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం, టెలి-మానస్ వంటి సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు. మానసిక సహాయం అవసరమైనవారు టెలి-మానస్ ఉచిత సహాయవాణి 14416 ను సంప్రదించవచ్చని చెప్పారు.
కార్యక్రమంలో టీపీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. సుధాకర్, రాష్ట్ర కోశాధికారి డా. శ్రీపూజ, ఉపాధ్యక్షులు అలియా పర్వీన్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాజు ఆచార్య, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సునయన, రాష్ట్ర నాయకులు ప్రశాంతి, అన్నత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రణయ్ మీసాల, దేదీప్య, రోజా, పాల్గొన్నారు.





