హైదరాబాద్, అక్టోబర్ 11 (ట్రైనెట్ న్యూస్):
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు రెండో రోజు ఆదివారం రవీంద్రభారతిలో సందడిగా సాగాయి. అటుకుల బతుకమ్మ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడి ఆడిపాడారు.
జాతీయ అవార్డు గ్రహీత పద్మావతి నేతృత్వంలోని దివ్యాంగుల బృందం ఉత్సాహంగా పాల్గొంది. అలేఖ్య సంస్థ ఆధ్వర్యంలో సుమారు వంద మంది మహిళలు, విద్యార్థులు, చిన్నారులు బతుకమ్మ పాటలు, నృత్యాలతో సందడి చేశారు. మహిళలు, దివ్యాంగులు, కళాకారుల భాగస్వామ్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని కార్యక్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. పూలను పూజిస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెబుతుందన్నారు.
కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సహాయ సంచాలకులు పి. నర్సింహులు, పరిపాలన అధికారి డాక్టర్ పి. విజయకుమార్, సూపరింటెండెంట్ జె. శ్రీనివాస్, హేమలత, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు ముచర్ల దినకర్, పల్లె నర్సింహా, శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










