కొడుకు తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్న అక్కసుతోనో ఏమోగానీ "ఎలా పెంచారు నిన్ను మీ అమ్మ వాళ్లు? నువ్వు వచ్చిన దగ్గర నుండి నాశనం అయ్యాము మేము" అంటూ అరిచింది అత్తగారు. అప్పటికే చాలాసార్లు ఇలాంటి మాటలు విని, ఇక ఆపుకోలేక "ఏమైనా ఉంటే నన్ను అనండి. మా తల్లిదండ్రులను ఎందుకు అంటున్నారు?" అని అనేసింది కోడలు. "మా ఆవిడకే ఎదురు సమాధానం చెప్తావా? ఇదేనా నీ సంస్కారం?" అంటూ మామగారు కోడలు మీదికి చెయ్యెత్తారు. "నువ్వు ఎవరివి అసలు నా మీద చెయ్యెత్తడానికి? ఆ మాత్రం నేను తిరిగి కొట్టలేనా?" అంటూ కోడలు కూడా చేయెత్తింది. "నా ముందే మా నాన్నతో గౌరవం లేకుండా మాట్లాడుతావా? నీకు ఎంత ధైర్యం. నాకు నువ్వు అవసరమే లేదు ఇక" అంటూ ఆమెను ఇంట్లోంచి గెంటేసిన భర్త. పుట్టింటికి వెళ్ళిన భార్య అవమాన భారంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కూతురి ఆత్మహత్యకు భర్తే కారణం అంటూ ఆమె తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టారు. ఇప్పుడు భర్త జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి.
అసలు విషయం ఎక్కడ మొదలైంది? ఎక్కడిదాకా వెళ్ళింది? ఎలాగైనా ఎదుటివారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం, సందర్భం గెలవాలని తాపత్రయమే తప్ప అసలు ఏం చేస్తున్నాం అనే ఆలోచన ఎవరికి ఉంది?
ఓ 4 లేక 5 గంటలు చేసే ప్రయాణం గురించి అయినా ఏ సమయానికి మొదలవ్వాలి, వెంట ఏమేం తీసుకెళ్లాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఏ సమయానికి చేరుకోవాలి? అని ఒక పది నిమిషాలు అయినా ఆలోచిస్తాం కదా. అలాంటిది ఓ 60 లేదా 70 సంవత్సరాలు గడిపే జీవితం ఇది. ఓ పని చేసే ముందు కాస్తయినా ఆలోచన ఉండాలి కదా.
మన ఆలోచన కన్నా ముందే మన భావోద్వేగాలు పరిగెత్తినంత కాలం మనం ప్రశాంతంగా ఉండలేము మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచలేము.
న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం "ప్రతీ చర్యకు దానికి సమానమైన మరియు వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది." ఎదుటివారి మాట లేదా ప్రవర్తన వలన మనం కోపంతోనో, బాధతోనో స్పందించాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ మన స్పందన ఎలా ఉంటుందో దానికి తగిన ప్రతిచర్య కూడా ఎదుటి వాళ్ల నుండి వస్తుంది కదా. మరి ఆ ప్రతిచర్యను కూడా ఎదుర్కోవాల్సింది మళ్లీ మనమే కదా. అందుకే జరిగిన సంఘటనలకు స్పందించే ముందు కాస్త ఆగి, ఆలోచిస్తే మంచిది.
బంధుత్వాన్ని వదులుకోవడం ఎంతసేపు? నిమిషం చాలు. కానీ ఒకసారి మన మాట, ప్రవర్తనతో పోగొట్టుకున్న బంధాన్ని మళ్లీ తిరిగి పొందాలంటే చాలా సమయం పట్టొచ్చు, చాలా కష్టపడాల్సి రావచ్చు. కోపంలో ముందు వెనక ఆలోచించకుండా మాటలు అని, ఆ సందర్భంలో మనిషిని గెలవగలవేమో కానీ మనసుని మాత్రం గెలవలేవు.
ఎదుటి మనిషి మాట లేదా ప్రవర్తన నీకు నచ్చలేదు అనుకుందాం. వెంటనే ఓ మాట అనేయకుండా ఒక్కసారి ఆగి ఆలోచించండి. "ఆ వ్యక్తి నిజంగా నీ మీద ద్వేషంతోనే అలా అన్నారా? నిన్ను రెచ్చగొట్టడానికి ఆ మాటలు మాట్లాడారా? అతను అన్న మాటలో ఎంతవరకు నిజం ఉంది? అతను గతంలోనూ మీతో ఇలాగే ప్రవర్తించారా? లేదా కోపంతో ఒక మాట నోరు జారారా? వాళ్లు నీ మంచిని కోరే వారేనా? ఎప్పుడైనా నీకోసం, నీ కష్ట సమయంలో తోడుగా నిలబడ్డారా? అతను అన్న మాటలు రేపు ఇంకొకరు అనకూడదు అంటే మన ప్రవర్తనలో ఏం మార్పు రావాలి?" అని కాస్త ఆలోచిస్తే వారి ప్రవర్తనకు మనం ఎలా స్పందించాలో మనకు అర్థమవుతుంది. ఎదుటివారు కోపంలో అనే మాటల తీవ్రత మన మెదడు వరకే ఆగాలి. మనసు దాకా రానివ్వకూడదు.
వాళ్లు అరిచిన వెంటనే స్పందించనవసరం లేదు. కాస్త ఆగి ఆలోచించాక, మన నిర్ణయం సరైనది అనిపించాక, సరైన పద్ధతిలో సరైన సమాధానం ఇస్తే సరిపోతుంది.
చివరిగా ఒక్క మాట: "ఎవరేమన్నా నిశ్శబ్దంగా భరించండి" అని అనట్లేదు కానీ "బదులుగా మనం స్పందించే ముందు, మన భావోద్వేగాలు అదుపులో ఉంటే బంధాలు నిలబడతాయి, భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుంది" అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం.
M. JAYA KRISHNA REDDY
M.S.(Counselling & Psychotherapy)
Motivational Speaker
Cell: 9640 21 55 41





