హైదరాబాద్, అక్టోబర్ 11 (ట్రైనెట్ న్యూస్):
కూచిపూడి తెలుగువారి జీవనాడి అని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొలేటి దామోదర గుప్తా అన్నారు. ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు, పద్మభూషణ్ వెంపటి చినసత్యం జయంతి సందర్భంగా గ్లోబల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో భాస్కర ఆడిటోరియంలో ‘జయహో కూచిపూడి’ పేరిట నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కొలేటి దామోదర గుప్తా, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లయన్ డాక్టర్ రమణరావు గ్లోబల్ ఈవెంట్స్, జై జవాన్ జై కిసాన్ జై కళాకార్, ఏబీసీ ఫౌండేషన్ తదితర సంస్థల సహకారంతో సంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ, వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలోనూ తల్లిదండ్రులు తమ పిల్లలను కూచిపూడి నాట్యంలో ప్రోత్సహించడం సంతోషకరమన్నారు.
మిస్ గార్జియస్ ఇండియా విజేత అలీసియా జోసెఫ్ మాట్లాడుతూ, సంప్రదాయ కళలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు జి. నేహంత్ మోహన్ పాల్గొన్నారు.
సభకు ముందు నృత్య గురువులు దేవి శ్రుతి, ఆశ్రిత, సరోజ చంద్రలేఖ, ఎ. శ్రీదేవి, రేధి బిల్లకంటి శిష్యబృందాలు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.






