న్యూఢిల్లీ, అక్టోబర్ 11 (ట్రైనెట్ న్యూస్):
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. వారణాసిలో నిర్వహించిన 94వ ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి ఆయన నాయకత్వం వహించారు. ‘వికసిత భారత్ కోసం మత్తురహిత యువత’ ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా సైక్లిస్టులు, వెయ్యి మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.
2026 ఐచి–నగోయా ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన ప్రాచీ చౌధరి, పారుల్ చౌధరి, జయ్ కుమార్, రాజ్ కుమార్ పాల్ కార్యక్రమంలో పాల్గొని యువతను ఉత్సాహపరిచారు.
ఉదయం 6 గంటలకు నమో ఘాట్ వద్ద ధ్యానంతో కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలో ఉన్న హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ యువజన వ్యవహారాల డైరెక్టర్ డాక్టర్ నివేదిత శ్రేయాన్స్ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యకరమైన జీవనానికి శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత అవసరమని వివరించారు. అనంతరం కథక్ నృత్య ప్రదర్శన, ఉత్సాహభరితమైన జుంబా సాధన నిర్వహించారు.
ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టి, మత్తురహిత తరాన్ని నిర్మించాలనే సంకల్పంతో మంత్రి, పాల్గొన్నవారు ‘నశా ముక్త్ భారత్’ ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం నమో ఘాట్ నుంచి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వరకు నిర్వహించిన 5.5 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీకి మాండవీయ నాయకత్వం వహించారు. వారణాసి వీధుల్లో సాగిన ఈ ర్యాలీ ద్వారా మత్తురహిత యువత, ఆరోగ్యకరమైన భారత్ సందేశాన్ని ప్రజలకు చేరవేశారు.





