మహిళల భద్రత, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం: మంత్రి పొన్నం ప్రభాకర్*
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10:
మహిళల భద్రత, ఆత్మగౌరవం, సాధికారతపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో మహిళా భద్రత బైక్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ మార్గ్ వద్ద జలవిహార్ నుంచి ట్యాంక్‌బండ్ చుట్టూ సాగిన ఈ ర్యాలీని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళల భద్రత, రహదారి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల హక్కులపై అవగాహన కల్పిస్తూ మహిళా సూపర్ బైకర్లు, స్కూటీ రైడర్లు, సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మహిళల భద్రత, హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. మహిళలు తమ కలలను సాకారం చేసుకునేందుకు, విద్యను అభ్యసించేందుకు, అన్ని రంగాల్లో ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. మహిళల భద్రత అనేది మహిళలకు మాత్రమే సంబంధించిన అంశం కాదని, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థతో పాటు కుటుంబాలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు, సమాజం కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే ప్రారంభం కావాలని మంత్రి అన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు మహిళలను గౌరవించే విలువలను నేర్పించాలని సూచించారు. మహిళలు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు కుటుంబ సభ్యులు ప్రోత్సాహం అందించాలని, వారికి స్వేచ్ఛతో కూడిన సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్లి స్ఫూర్తిగా నిలిచారని, ఆసియా క్రీడల్లోనూ మహిళా క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతున్నారని పేర్కొన్నారు. మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తే మరిన్ని విజయాలు సాధించగలరని అన్నారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో పాటు తమ ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జూపల్లి సూచించారు. ప్రతిరోజూ కనీసం గంటసేపు వ్యాయామానికి కేటాయించాలని కోరారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక దృఢత్వం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు షీ పవర్ ఫౌండేషన్, మహిళా బైకర్లు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రచారం చేయడంలో మహిళా బైకర్లు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మహిళల భద్రత, సాధికారత కోసం కృషి చేస్తున్న షీ పవర్ ఫౌండేషన్ నిర్వాహకులను మంత్రులు అభినందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళల భద్రత, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని గుర్తుచేశారు. మహిళలు నిర్భయంగా ప్రయాణించేలా ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నిరంతర అవగాహన అవసరమని, చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో పారదర్శకత కోసం ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్లను విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిక్ అన్సారీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతి రెడ్డి, డీసీపీ శిల్పవల్లి, సీబీఐటీ కళాశాల ప్రిన్సిపాల్ డా. నరసింహులు, షీ పవర్ ఫౌండేషన్ ఛైర్మన్ మనీష్, ఫౌండేషన్ నిర్వాహకులు అపూర్వ శ్రీవాస్తవ, అల్పనా శరత్, మహిళా సూపర్ బైకర్లు, స్కూటీ రైడర్లు, సైక్లిస్టులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.








