న్యూ ఢిల్లీ, అక్టోబర్ 10 (ట్రైనెట్ న్యూస్) :
తదుపరి తరం సముద్ర గస్తీ నౌక ‘శ్రేయస్’ (యార్డ్ 3040) శనివారం కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ)లో జలప్రవేశం చేసింది. నౌకాదళ ఉపాధిపతి వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్ సమక్షంలో రేమన్ కొచ్చర్ ఈ నౌకను జలప్రవేశం చేయించారు.
భారత నౌకాదళ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ, జీఆర్‌ఎస్‌ఈ ఉన్నతాధికారులు, పరిశ్రమల భాగస్వాములు పాల్గొన్నారు.
తదుపరి తరం సముద్ర గస్తీ నౌకల (ఎన్‌జీఓపీవీ) నిర్మాణం గోవాలోని గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జీఎస్‌ఎల్), కోల్‌కతాలోని జీఆర్‌ఎస్‌ఈలో ఏకకాలంలో కొనసాగుతోంది. స్వదేశీయంగా రూపకల్పన చేసి నిర్మిస్తున్న ఈ నౌకలు ప్రస్తుతం ఉన్న సముద్ర గస్తీ నౌకలకు అదనపు బలాన్ని అందించనున్నాయి.
సముద్ర నిఘా, గాలింపు–రక్షణ చర్యలు, సముద్రంలోని ఆస్తులు, స్థావరాల పరిరక్షణ, మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలు, సముద్రపు దొంగల నిరోధం వంటి విభిన్న విధులను ఈ నౌకలు నిర్వహించనున్నాయి.
భారతదేశ సమృద్ధమైన వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ నౌకలకు పేర్లు నిర్ణయిస్తున్నారు. సంస్కృతంలో ‘శ్రేష్ఠమైనది’ లేదా ‘అత్యుత్తమమైనది’ అనే అర్థాన్నిచ్చే ‘శ్రేయస్’ పేరును ఈ నౌకకు పెట్టారు.
‘శ్రేయస్’ జలప్రవేశం స్వదేశీ నౌకా నిర్మాణంలో భారత నౌకాదళం సాధించిన మరో కీలక మైలురాయిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలకు అనుగుణంగా ఈ నౌక నిర్మాణం చేపట్టారు.





